Showing posts with label వంటా-వార్పు. Show all posts
Showing posts with label వంటా-వార్పు. Show all posts

Tuesday, 22 May 2012

ఊరగాయలు -2-మామిడి కాయతో


నేను ముందుగా మన ఆంధ్రా ఊరగాయలు చెప్తాను. తరువాత వేరే ప్రాంతాల వారివి కూడా చెప్పుకోవచ్చ్సును.

పచ్చడి పెట్టె ముందు:
కాయలను కోసేందుకు కత్తి  పీట  వేరుగా ఉంటుంది.
  1. మామిడి కాయలు ముచికలు తరిగి నీళ్ళలో 1-2 గంటలు నానపెట్టండి. సొన అంతా కారి పోతుంది. 
  2. కాయలను బాగా కడిగి ఒక నూలు బట్టతో తుడిచి ఆరపెట్టండి. తడి లేకుండా ఆరిపోవాలి. 
  3. ముక్కలు కొట్టేటప్పుడు, నలగ కూడదు. పెచ్చు (టెంక) ఉండాలి. లేదా పచ్చడి నిలవ ఉండదు.ముక్క సైజు మీ ఇష్టం. కాని మరి పెద్దవి కాకుండా ఉంటేనే మంచిది. పెచ్చులు లేని ముక్కలను వేరు చేయండి. వాటితో వేరే పచ్చడి పెట్టుకోవచ్చు. 
  4. ప్రతీ ముక్కకీ ఉన్న జీడిని , పొరని తొలగించాలి.

అన్ని ముక్కలు పచ్చడికి తయారు.

1.  ఆవకాయ 

కావలసినవి:
మామిడి కాయలు   15  మీడియం సైజు 
ఆవ పొడి   1 కి 
మిరప పొడి  1కి 
ఉప్పు  1కి 
నువ్వుల నూనె  1+1/2 కి 
పసుపు  2-3 గుప్పెళ్ళు 
మెంతులు  1  గుప్పెడు 
తెల్ల వినెగర్  1/2 లి 

విధానం: 
  • కొలత ఏదైనా అంటే, గ్లాస్, కప్పు లేదా కిలో లెక్క అయినా ఆవ, కారం ఉప్పు సమంగా తీసుకుంటారు. 
  • ముక్క పులుపుని బట్టి, వీటి పరిమాణాన్ని ఎక్కువ/తక్కువ చేసుకోవచ్చును. అంటే ముక్క ఎక్కువ పులుపు అనిపిస్తే, ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. 
  • ఉప్పు అంతా ఒక్క సారి వేసుకోకుండా, సగం వేసుకుని రుచి చూసి తక్కువైతే కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకొండి.
  • కాయ సైజు ను బట్టి పొడులు ఎక్కువ తక్కువ తీసుకోండి.
  • పొడులన్నీ(ఆవ, మిరప, ఉప్పు, పసుపు) ఒక పెద్ద పళ్లెం కాని బేసిన్ లో కాని వేసుకోండి. అన్ని  బాగా  కలేసేటట్లు కలపండి. 
  • మెంతులు కూడా వేసి  కలపండి.
  • కొద్ది కొద్దిగా నూనె వేస్తూ పొడి కొద్దిగా తడి అయ్యేటట్లు కలపండి. అంటే 250 గ్రా సరి పోవచ్చు. మిగిలిన నూనె  విడిగా పెట్టుకోండి.
  • కొన్ని మామిడి ముక్కలు ఈ పొడిలో వేసి దోర్లించండి. ముక్కలకి బాగా పిండి పట్టాలి. 
  • ఒక జాడీలో ముందుగా కొంత పిండి వేసి పైన ఆ ముక్కలను వేయండి. కొద్దిగా పొడి ఒక పొరలాగా జల్లండి. 
  • మరల కొన్ని ముక్కలను పిండిలో దొర్లించి జాడీలో వేయండి. మరల కొంత పిండి వీటిపై వేయండి. 
  • ఇలా ముక్కలు, పిండి అయిపోయేంత వరకు చేయండి. 
  • ఇప్పుడు జాడిని పొడి బట్ట పెట్టి తుడిచి మూత పెట్టండి. దీని పై ఏదయినా ఒక బేసిన్ బోర్లించి, నీళ్ళు తేమ లేనీ చోట పెట్టేయండి. 
  • మూడు రోజుల తరువాత, జడిలోని ఆవకాయను అంతా ఒక పెద్ద పళ్ళెం లోకి తీసుకుని, బాగా కలపాలి. ఇప్పటికి ఊట వచ్చి ఉంటుంది. 
  • కొద్దిగా రుచి చూడండి. ఉప్పు, కారం, ఆవ, ఏది తక్కువ అనిపించినా అది కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలపండి. 
  • వినెగర్ కుడా వేసి బాగా కలపండి. ఇది ముక్క మెత్త పడకుండా ఉంచుతుంది. కారం కూడా ఎర్రగా ఉంటుంది. 
  • మళ్లి జాడీలో వేయండి. 
  • మిగిలిన నూనెను అంతా జాడీలోని పచ్చడి పైన పోసేయండి. కనీసం అంగుళం దాక పైన నునె ఉండాలి. 
  • జాడి పైన మూత పెట్టి, గుడ్డతో వాసిన కట్టండి. పైన ప్లాస్టిక్ కవర్ కూడా కడితే, గుడ్డ మీద దుమ్ము పడదు. 
  • కావలిసినప్పుడు, తడి లేని గరిటెతో తీసుకుని చిన్న సీసాలలో, జాడిలలో పెట్టుకోండి.
నోరూరించే ఆంధ్ర ఆవకాయ రెడి.

2. శెనగల ఆవకాయ
పైన చెప్పినట్లు అంతా అదే విధానం కాక పొతే 1 కప్పు శెనగలు (దేసవాళి రకం) మెంతులుతో పాటు పిండిలో వేసుకోవాలి.

కాని శెనగలు వేస్తే పచ్చడి లోని ఊట పిల్చేసి, గట్టిగా ఎండి పోయినట్లు అవుతుంది. అందుకని కొద్దిగా వేసుకోండి.

3. పెసర ఆవకాయ 
పైన మామూలు ఆవకాయకు చెప్పిన విధానమే. ఆవ బదులు పెసర పప్పు బాగా ఎండా పెట్టి పిండి పట్టుకుని వాడుకోవాలి. 1-2 గుప్పెళ్ళు ఆవ పొడి కావాలనుకుంటే వేసుకోవచ్చును. ఇది కమ్మగా ఉంటుది. పిల్లలు ఇష్టంగా తింటారు. తక్కువ కాయలు పెట్టుకుంటారు కాబట్టి, కరం, ఉప్పు, పెసర పిండి అన్నీ తగ్గ్గట్టుగా వేసుకోండి.


మీ...అనామిక....

Sunday, 20 May 2012

ఊరగాయలు-1-మామిడి కాయతో


ఆంధ్రా అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఊరగాయలు. మనం ఎన్నో రకాల ఊరగాయలు పెట్టుకుంటాం. ఆవకాయ, గోంగూర, పండుమిరప కారం, ఉసిరి కాయ,చింతకాయ ఇలా ఎన్నో పచ్చళ్ళు. మనం అన్ని రకాల ఊరగాయలు చెప్పుకుందాం. మన ఆంద్ర పధతే కాక ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుకునే పధతులు కూడా చెప్పుకుందాం.

మామిడి కాయతో :

మరి ఆంధ్రుల అభిమాన ఊరగాయలలో ఒకటి అయిన మామిడికాయ ఊరగాయలతో మొదలు పెడదాం.
ముందు మాట:
ఊరగాయలంటే ఏడాది పాటు ఉండాలి. పచ్చడి పెట్టేటప్పుడు కొద్దిగా శ్రద్ద వహిస్తే పచ్చడి, రుచిగా, శుచిగా చక్కగా ఉంటుంది. కొంచెం అశ్రద్ధ చేసినా, పచ్చడి సరిగ్గా కుదరదు. నిలువ ఉండదు. సమయం, డబ్బు అన్ని వృధా. అందుకని, క్రింద చెప్పిన వాటిని, పాటించండి.
నాకు మాత్రం పచ్చళ్ళు పెట్టటం అనేది ఒక యఙ్ఞం వంటిదే. మా అమ్మమ్మ నాకు నేర్పింది అదే- ఏ పని చేసినా చాల శ్రధ్ధగా, ఓర్పు గా చేయాలి అని.
  • పచ్చడికి వాడే సామగ్రి అంతా మేలైనవి వాడాలి. ఇక్కడ డబ్బు ఆదా చేద్దామనుకుంటే పచ్చడి గురించి మర్చి పోండి. 
  • మామిడి కాయలు రకరకాలవి ఉంటాయి.మంచి మేలు రకానివి ఎన్నుకోవాలి.ఆవకాయకి మాత్రం బంగినపల్లి, పెద్ద/చిన్న రసాలు, జలాలు, నీలం రకాలు మంచివి. చాల మంది, నాటు రకం అని, ఇంకా వేరే రకాలు వాడతారు. రుచి బాగుండదు. ముక్క తొందరగా మెత్త పడుతుంది. నేను చాల అనుభవంతో చెపుతున్నాను. 
  • మామిడి కాయాలు ముదురు ఆకుపచ్చ రంగులో నొక్కితే గట్టిగా ఉండాలి. పగుళ్ళు, దెబ్బలు లాంటివి ఉండకూడదు. మెత్తగా ఉండకూడదు.
  • కాయలు తింటే కరకర లాడుతో ఉండాలి. బాగా పుల్లగా ఉండాలి. కాయ ముదురుగా ఉండి, టెంక గట్టిగా ఉండాలి. టెంక ముదురుగా ఉండాలి. 
  • మాగాయకి మాత్రం ఏ రకం అయినా వాడుకోవచ్చును. కొద్దిగా పండినా సరే. కొద్దిగా మెత్తగా ఉన్నా సరే. బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది. 
  • మిరపకాయలు, ఆవాలు, ఇతర దినుసులు, మంచివి కొని, శుభ్రం చేసుకుని బాగా ఎండ పెట్టుకోవాలి. పచ్చడి పెట్టె రోజు ముందు రోజు పొడి చేసుకుని పెట్టుకుంటే, బాగుంటుంది. మేమైతే, కారం, ఆవ, అన్ని పొడులు ఇంట్లోనే మిక్సిలో పొడి చేసుకుంటాము.
  • రెడి మేడ్ వాడితే, మంచి బ్రాండువి వాడండి. లేదా కల్తి ఉంటుంది. 
  • మిరపకాయలు నేను రెండు రకాలవి వాడతాను. గుంటూరు రకం కారం ఎక్కువగా ఉంటుంది. అది రుచికి. కారం చాలా తక్కువగా ఉండి మంచి రంగు ఉన్నవి (కాష్మీరు, వరంగల్ లేదా బ్యాదగి)రంగు కోసం. మీరు తినే కారాన్ని బట్టి ఏ రకం ఎంత వాడుకోవాలో పాళ్ళు సరి చూసుకోండి. 
గుంటూరు మిరప -కారం ఎక్కువ 
ఇవి రంగు కోసం 
  • ఆవాలు నేను లావువి వాడతాను. సన్నవి బాగా ఘాటు ఉండి ఎక్కువ వేడి చేస్తాయి. ఏది వాడుకుంటారో మీ ఇష్టం.
  • ఉప్పు ఏ పచ్చడికైనా చాలా ముఖ్యం. తక్కువైనదా పచ్చడి పాడైపోతుంది. ఎక్కువైందా దానిని సరి చేయటానికి కష్టాలు పడాలి.
  • టేబుల్ సాల్ట్ లేదా అయోడిన్ ఉన్న ఉప్పు వడ వద్దు. మాములు రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి. 
  • రాళ్ల ఉప్పుని బాగా ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలి. పొడి చేసినది కూడా దుకాణాలలో దొరుకుతాయి.
  • నూనె -నువ్వుల నునె వాడితే చాలా మంచిది. పప్పు నునె అంత రుచి ఉండదు. నూనె తక్కువ అయితే పచ్చడి నిలువ ఉండదు. తప్పనిసరిగా కావలసినంత వాడవలసినదే.
  • పచ్చడి కోసం వాడే పళ్ళాలు, గరిటెలు, నిలువ ఉంచడానికి వాడే జాడీలు, సీసాలు, ముందుగానే బాగా కడిగి ఆరబెట్టి, ఎండలో ఒకటి -రెండు గంట అయినా పెట్టి ఉంచాలి. 
  • స్టీలు, ప్లాస్టిక్ కంటే, గాజు, పింగాణివి మంచివి. చెక్క గరిటెలు పొడవుగా బలంగా ఉన్నవి కలపడానికి బాగుంటాయి. 
  • కాని చెయ్యి పెట్టి చేసినట్లుగా ఏదీ ఉండదు.పచ్చడి చేతితో కలిపేటప్పుడు ముందుగా చేతులకి (మోచేతులదాకా) నువ్వుల నూనె బాగా రాసుకోండి. చేతులు మండవు. లేదా గ్లవ్సు వేసుకోండి.
  • మామిడి కాయలు తెచ్చుకునే ముందే అన్నీ తయారుగా పెట్టుకోవాలి. తెచ్చిన తరువాత ఎక్కువ సేపు ఉంచితే పచ్చడి సరిగ్గా రాదు. అందుకని హడావిడి పడకుండా అన్నీ అమర్చుకుని పెట్టుకోవాలి.
  • పచ్చడి కలిపే ముందు, వంట గది, టేబులు, గరిటెలు, ఇతర సామానలు,అన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. సామాగ్రి అంతా అందు బాటులో ఉండేటట్లు ఉంటే పని త్వరగా అవుతుంది. మొదలు పెట్టిన తరువాత మధ్యలో అవి ఇవి అని వెతుక్కుని, ఆ చేతులతో అవి ఇవి ముట్టుకుంటే పచ్చడి నిలువ ఉండదు.
  • పచ్చడి కలిపేటప్పుడు, సావకాశంగా చేసుకోవాలి. పక్కన ఇంకొకరు ఉంటే చాలా సుళువు. పచ్చడి కొద్దిగా అయితే సరే గాని,ఒక్కరే అయితే ఎక్కువ మోతాదులో పెట్టుకోవటం కష్టం.
అన్ని సిద్దం చేసుకోండి. ఇంకా ఊరగాయలు  పెట్టుకోవటమే...


మీ...అనామిక....

వాము-ఆవ మిరపకాయలు

ముద్ద పప్పు, పెరుగన్నం, లేదా మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ ఇలా ఏదైనా అన్నం తో తినవలసి వస్తే, కొద్దిగా కారంగా ఏదైనా పక్కన ఉంటె బాగుంటుంది అని అనుకుంటాం.ఇదిగో,వాము మరియు ఆవ మిరపకాయలు బాగుంటాయి. చేసి చూడండి.
ముందుగా :
  • మిరపకాయలు పచ్చివి, ఆకుపచ్చగా ఉండి, వెడల్పుగా, పొట్టిగా ఉంటే బాగుంటుంది. మరి కారం ఉన్నవి వద్దు. మీరు తినగలిగితే సరే. 
  • తాజాగా ఉన్నవి, తొడిమెలతో ఉన్నవి తీసుకోండి. 
  • నీళ్ళల్లో బాగా కడిగి, తడి లేకుండా బట్టతో తుడిచి కొంచెం సేపు ఇంట్లో ఆరబెట్టండి . తడి ఉంటే నిలువ ఉండవు. 
  • నిలువుగా చీరి అంటే గాటు పెట్టి లోపలి గింజలను అవసరం అనుకుంటే తీసివేయండి. 
1. వాము మిరపకాయలు 
వాము 

కావాలసినవి:
పచ్చి మిరపకాయలు  100 గ్రా 
వాము  50 గ్రా
పప్పు నునె   50 గ్రా 
పసుపు  1/2 టీ  స్పూన్ 
ఉప్పు తగినంత 
నిమ్మకాయ  1 

చేసే విధానం :
  • వాము ని పొడి చేసుకోండి 
  • వాము, ఉప్పు, పసుపు బాగా కలపండి
  • నిమ్మరసం తీసి ఈ పొదిలో వేసి కలపండి 
  • పచ్చి మిరపకాయలను నిలువుగా చీరి(గాటు పెట్టి) ఈ పొడిని కూరండి.
  • ఒక గాజు సీసాలో మిరప కాయలను పెట్టి పై నుండి  నునె   పోయండి. బాగా కుదపండి. నునె అన్ని కాయలకు పట్టేలాగా అన్న మాట. 
  • 2-3 గంటలు ఉరిన తరువాత తినవచ్చు.
  • వారం పాటు ఉంటాయి. కాని నిమ్మ రసం వాడాము కనుక ఫ్రిజ్ లో పెట్టుకోండి.

2. ఆవ మిరపకాయలు 
ఆవ పొడి 

పైన చెప్పినట్లుగానే చేయాలి. వాము బదులు 50 గ్రా ఆవ పొడి వాడండి.



మీ...అనామిక....

మసాలా పాపడ్


మనకి టీ తో తినటానికి కాని లేదా సాయంకాలం తోచనప్పుడో అలా నోట్లో ఏదైనా వేసుకోవాలని అని పిస్తుంది. ఇంటికి అనుకోకుండా అతిధులు వచ్చినా లైట్ గా పెట్టటానికి కాని ఈ మసాలా పాపడ్ పనికి వస్తుంది. సూప్ తో పాటు స్టార్టర్ గా కూడా పనికి వస్తుంది. డిన్నర్ ఇచ్చినా , లేదా చిన్న పార్టీ ఇచ్చినా ఇది ఒక ఐటంగా పెట్టుకోవచ్చు. 

సాధారణంగా అప్పడాలంటే కేవలం సామ్బారుతో తినేందుకే అని అనుకుంటాం. అల కాకుండా ఇలా వెరైటి గా కూడా తినవచ్చును. అప్పడా లలొ రక రకాలైనవి ఉన్నాయి. మాములు తెల్ల అప్పడాలు (మద్రాసువి) కాకుండా మన ఆంధ్రలో చేసుకునే, మినప, పెసర, శనగ పిండివి అదీ మసాలా వేసినవి అంటే, ఎర్రకారం, మిరియాలు, ఇంగువ, వెల్లుల్లి ఇలాంటివి వివిధ రకాలవి అయితే విడిగా తినటానికి బాగుంటాయి. మన కోస్తా ప్రాంతాలలో నువ్వులు అద్దినవి కూడా ఉంటాయి. 

ఇలాగే, పంజాబీ వారివి కూడా ఉంటాయి. 

నునె ఆరోగ్యానికి మంచిది కాదు. అందు కని నునె లేకుండా నిప్పుల పైన కాని, గాస్ స్టవ్ పైన కాని కాల్చుకోవచ్చును. మైక్రోవేవ్ ఓవెన్ ఉంటె ఇంకా మంచిది. చిటికలో చేసుకోవచ్చు. ఒక చిన్న కుంచె తో కాని లేదా చేతితో కాని అప్పడానికి రెండు వైపులా కొద్దిగా నునె రాసి కాలిస్తే నునెలో వేయించినట్లు గానే ఉంటాయి.

మినప/పెసర ఎర్ర కారం అప్పడాలు. 
 మినప+శెనగ పిండి, ఎర్ర కారం, మిరియాలు వేసిన అప్పడాలు.

వాటిని నిప్పు పై కాల్చి/నునె లో వేయించి, సన్నగా తరిగిన ఉల్లి, కీరా దోస, టొమాటో  ముక్కలు, కొత్తిమీర వేసి, చాట్ మసాలా చల్లాండి. నిమ్మకాయ పిండి వెంటనే వడ్డించండి. ఇదే మనం హోటల్ లో తినే స్టార్టర్. అప్పడాలు ఎక్కువ కారం లేకుండా ఉంటే, పిల్లలు కుడా ఇష్టంగా తింటారు. చలి కాలం అయితే వేడి వేడి సూప్ తో పాటు తినవచ్చు.

అప్పడాన్ని నాలుగు ముక్కలుగా చేసి తరువాత కాల్చి పైన ఇవన్ని వేసి కూడా సర్వ చేయవచ్చు.

మీ...అనామిక....

Tuesday, 1 May 2012

ఊరమిరపకాయలు

ఊరమిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు అనగానే నోరు ఊరుతుంది కదూ. మామిడికాయ దోసకాయ లేదా ఏ ఆకుకూర పప్పు తోనో తింటే ఇంకా వేరే చెప్పలా?

ఎలా చేయాలోతెలుసుకుందాం.

కావలసినవి:
మజ్జిగ అర లీటరు
పచ్చి మిరపకాయలు 500 గ్రాములు 
ఉప్పు  తగినంత 
పసుపు   1-2 టీ చెంచాలు 

విధానం:
  • మజ్జిగ బాగా పుల్లగా చిక్కగా ఉండాలి.
  • మిరపకాయలు లావుగా పొట్టిగా ఉండాలి. 
  • మిరపకాయలను కడిగి పొడి బట్టతో తుడిచి కొంచెం సేపు నీడలో ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టండి.
  • ప్రతి మిరపకాయకీ నిలువునా గాటు పెట్టండి.
  • మజ్జిగలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మిరపకాయలను అందులో వేసి బాగా కలియ బెట్టి, 2-3 రోజులు నానా పెట్టాలి.  
  • నాలుగవ రోజు జల్లెడలో వేసి మజ్జిగ అంతా కారిపోయిన తరువాత ఎండలో పెట్టాలి.
  • రాత్రి మరల ఈ కాయలను మజ్జిగలో వేసి నాననివ్వాలి.
  • మరల ప్రొద్దున్నే కాయలను, మజ్జిగాలోంచి తీసి, ఎండా పెట్టాలి.
  • ఇలా మజ్జిగంతా అయిపోయిన దాకా చేయాలి.
  • చివరగా గల గల లాడేటట్టు ఎండనిచ్చి, ప్లాస్టిక్ కవరు లో వేసి, గాలి చొరబడని డబ్బాలో లేదా సీసాలో వేసి పెట్టు కోవాలి.
  • కావలసినప్పుడు, నూనె బాగా వేడి చేసి,అందులో  ఊరమిరపకాయలు  వేసి వేగిన వెంటనే తీసేయాలి. 

మీరు చేసి చూడండి....
  

మీ...అనామిక....

Wednesday, 18 April 2012

రుచికరమైన అప్పడాలు-వడియాలు-1

ఎండా కాలం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి బోలెడు పని. అయిన మన దేశంలో అదీ మన రాష్ట్రంలో ఆడవాళ్ళకి పని లేనిది ఎప్పుడండి? ఏ కాలం  అయినా పచ్చడ్లని, పోడులని, ఉరగాయాలని ఏదో ఒక పని. 

అసలు ఇలా పచ్చడ్లు, మురబ్బాలు, జామ్లు, అప్పడాలు, వడియాలు, వరుగులు ఇవన్ని ఎందుకంటే, కొన్ని కొన్ని కాలాలో విరివిగా కాసే పళ్ళు కూరలు వంటివి, తక్కువ ధరలో కొని,  భద్ర పరచుకుని, తరువాత వాడుకోవచ్చు. 

ముఖ్యంగా ఎండలు బాగా కాస్తున్నప్పుడు, తరువాత శ్రావణ భాద్రపదాలలో కూరలు పళ్ళు సరిగ్గా దొరకవు. అదీ కాక మనకి ఇష్టమైనవి, ఆరోగ్యన్నిచ్చేవి రోజు కాక పోయిన అప్పుడప్పుడు తినలిగా. ఇంటికి వచ్చిన అతిథులకి సమయానికి కూరలు పచ్చళ్ళు నాలుగైదు చెయ్యలేక పోవచ్చు.  అలాగే పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి నాలుగైదు రకాలు తినటానికి ఉండాలికదా. పిల్లకి, పెద్దలకీ తోచన్నప్పుడు లేదా ఏ మధ్యనమో అలా నోట్లో వేసుకోవటానికి--మరి వీటన్నిటికి అప్పడాలు వడియాలు వంటివి బాగుంటాయి. 


మన రాష్ట్రం లో అసలు అప్పడాలు వడియాలు లేనిదే విందు భోజనం ఉండదు. 


ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఇవి దొరుకుతున్నాయి. కాని వాటిల్లో వాడే పదార్ధాలు ఎలా ఉంటాయో తెలిదు. అదీ కాక బోలెడు ఖర్చు. కొద్దిగా శ్రమ అనుకోకుండా మనమే వీలుచేసుకుని పెట్టు కుంటే నాణ్యమైనవి తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు. 


సరేనండి ఇప్పుడు మనం రుచికరమైన రక రకాల వడియాలు ఎలా పెట్టుకొవాలో తెలుసుకుందాం. వడియాలు ఒకొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. మన రాష్ట్రంలోనే కాక ఉత్తరాది వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే అన్ని చెప్పుకుందాం. 

1. గుమ్మడి కాయ వడియాలు :
మన  ఆంధ్ర  రాష్ట్రం  దీనికి  పెట్టింది  పేరు. అసలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ వడియాలు. 


కావలసినవి:
బూడిద గుమ్మడికాయ 1 పెద్దది 
మినప్పప్పు    అర కిలో
పచ్చి మిర్చి     పావు కిలో 
ఇంగువ      ఒక టీ స్పూన్ 
ఉప్పు తగినంత 


ముందు మాట : 
  1. గుమ్మడి కాయ బాగా ముదురు అయినది వాడాలి.
  2. దీనికి పొట్టు మినపప్పు వాడితే రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడాను.
  3. ఈ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. 
  4. కాయని బట్టి పప్పు ఎంత అన్నది చూసుకోవాలి. కొంత మందికి ముక్కలు ఎక్కువగా ఉంటె ఇష్టం. కొంత మందికి పిండి ఎక్కువగా ఉంటె ఇష్టం. ఎదైనా ముక్కలు మరీ ఎక్కవగా ఉంటే వడియాలు పెట్టటం కష్టం. ఆ ముక్కలను పట్టి ఉంచే అంత పిండి ఉండాలి. 
  5. మీరు పప్పు కొంచెం ఎక్కువ నాన్న బెట్టుకోండి. మిగిలిన పిండి ఏ గారెలో వేసుకోవచ్చు. తక్కువ అయితే కష్టం. 
  6. ఇంగువ మంచి సువాసన కలిగినది వాడితే బాగుంటుంది.
  7. పచ్చి మిరప కారమే బాగుంటుంది. లేదంటే పొడి కారం వాడండి.
  8. పచ్చి మిరప కాయలు మెత్తగా దంచి/రుబ్బి గాని లేదా ముక్కలుగా గాని వాడుకోవచ్చు. కాని మెత్తగా దంచినదైతేనే బాగుంటుంది. ముక్కలైతే కారం అంతటా కలవదు.
  9.  కారం, ఉప్పు  మీ రుచిని బట్టి వేసుకోండి. 
మొదటి విధానం: 
  • వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి తగినంత నిరు పోసి పప్పు నాన బెట్టండి.

  • గుమ్మడి కాయను ముక్కలుగా తరగాలి.
  • ముక్కలు మరీ పెద్దవి చిన్నవి కాకుండా ఉండాలి. 
  • గింజలు తీసివేయండి. పక్షులు కానీ ఉడతలు కాని ఈ గింజల కోసం వడియాలు పడుచేస్తాయని తిసేయమంటారు.
  • ముక్కలని ఒక పలుచని నూలు వస్త్రం(పాత తువాలు,పంచె, లాంటివి) లో  వేసి బాగా గట్టిగా మూట కట్టాలి.
  • ఈ మూటను చేటలో/చిల్లుల బుట్టలో పెట్టి పైన ఒక పళ్ళెం/పీట పెట్టి దానిపై పొత్రం లాంటి బరువు  పెట్టాలి. 
  • ఇది వరుకు వెదుర లేక తాటాకు బుట్టలు వాడే వాళ్ళు. మనం చిల్లుల స్టీల్ బుట్ట/జల్లెడ  వాడుకోవచ్చు.
  • ఈ ముక్కల నుండి వచ్చే రసం ఒక బేసిన్లో గాని పెద్ద లోతైన  పళ్ళెంలో గాని వోడేటట్టు  పెట్టుకోండి. అంటే ముక్కలు ఉన్న బుట్ట/జల్లెడ ఏట వాలుగా పెడితే ఇంకా మంచిది. 
  • మర్నాడు, ప్రొద్దున్నే పప్పు బాగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగాలి. పొట్టు పప్పు వాడితే పొట్టు పోయేంత వరకు కడగాలి.పొట్టును వేరుగా వడియాలు పెట్టవచ్చు. అందుకని పారేయకండి. 
  • పప్పును నీరంతా వోడిపొయేదాకా జల్లెడ/చిల్లుల బుట్టలో వేసి పెట్టు కోండి.
  • పప్పు ను బాగా మెత్తగా కాటుక లాగా రుబ్బాలి కాని చాలా చాలా గట్టిగా ఉండాలి. దీనికి గుమ్మడికాయ నీళ్ళను ఉపయోగించండి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు వాడండి.
  • పిండీ పలుచగా ఉంటే, వడియాలు పెట్టటానికి సరిగ్గా రావు.త్వరగా ఎండవు. బట్ట నుండి వలవటానికి కష్టం. పొడి పొడి అవుతాయి. 
  • మిక్సి కంటే వెట్ గ్రైండర్ లో రుబ్బిన పిండి చాల బాగుంటుంది. గట్టిగా రుబ్బడం  తేలిక. గుల్లగా వస్తాయి. 
  • పప్పు బాగా నలిగాక ఉప్పు, ఇంగువ  పచ్చి మిర్చి వేసి మరి కొంచెం  సేపు  రుబ్బండి. ఇలా చేస్తే అన్ని బాగా కలసిపోతాయి.
  • ఈ పిండిని ఒక పెద్ద గిన్నె లోకి తీసుకుని, ముక్కలు వేసి బాగా కలపండి. 
  • ఒక మందపాటి నూలు చీరె కాని, దుప్పటి కాని నీళ్ళల్లో తడిపి బాగా పిండుకోండి.
  • చెక్క బల్ల కానీ, మంచం మిద కాని లేదా నేలపైన కాని చాపను పరిచి దాని పైన ఈ గుడ్డని కొద్ది కొద్దిగా పరుచుకుంటూ, వడియాలు పెట్టాలి. అంతా ఒక సారే పరిస్తే బట్ట తడి ఆరిపోతుంది. అప్పుడు వడియాలు సరిగ్గా రావు.
  • ఒక గిన్నెతో నీళ్ళు దగ్గెర పెట్టుకుని, బట్ట పొడి అయితే కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి. 
  • అలాగే చెయ్యి తడి చేసుకుంటూ ఉండాలి. 
  • మధ్య మధ్యలో పిండి బాగా కలపకపోతే, ముక్కలు పైకి ఉండి, పిండి క్రిందికి జారిపోతూ ఉంటుంది. 
  • వడియాలు మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా పెట్టాలి. అలాగే ముక్కలూ, పిండీ రెండు సమంగా ఉంటె బాగుంటుంది. 
  • రెండు రోజులు బాగా ఎర్రటి ఎండలో ఎండా బెట్టాలి. తరువాత నెమ్మదిగా వడియాలను బట్టనుండి వేరు చేయాలి.
  • వలవటం కష్టంగా ఉంటే, బట్ట వెనుక వైపు కొద్దిగా నీళ్ళు చిలకరించి, కొన్ని నిముషాల తరువాత నెమ్మదిగా తీస్తే తేలికగా వస్తాయి.
  • ఇవి తిరగేసి ఒక రెండు రోజ్జులు ఎండ బెట్టాలి.
  • బాగా కరకర లాడే దాకా ఎండ బెట్టి, సాయంత్రం కొద్ది సేపు ఇంట్లో వేడి తగ్గే వరకు ఉంచి, ఒక మంచి సేలోఫెన్ సంచిలో వేసి గాలి చొర బడకుండా మూత పెట్టుకోండి. ఇలా చేస్తే, వర్షా కాలంలో చెమ్మకి వడియాలు పాడవకుండా ఉంటాయి.
  • అప్పుడప్పుడు ఎండ బాగా వచ్చిన రోజున ఒక్క సారి ఎండ బెడితే సంవత్సరం పాటు ఉంటాయి. 

రెండో విధానం: 

గుమ్మడి కాయను తురిమి కూడా పెట్టు కోవచ్చు. క్రింతం రోజు రాత్రే తురిమి, బట్టలో వేసి మూటలా కట్టి బాగా గట్టిగా పిండీ, ఆ నీటిని పప్పు రుబ్బడానికి వాడుకోవాలి. మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పినట్లే. 

వడియాలు, గుల్లగా రావాలంటే, పప్పు కాటుక లాగా, గట్టిగా, చాలా తక్కువ నీటితో రుబ్బుకోవాలి. ఎర్రని ఎండలో ఎండా బెట్టాలి. ఎండ సరిగ్గా లేక ఎక్కువ రోజులు ఎండితే, వడియాలు సరిగ్గా రావు.


మరి మీరు పెట్టి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో....


మీ...అనామిక....

Friday, 6 April 2012

పచళ్ళు -3


పెరుగు పచ్చళ్ళు -2

క్రిందటి టపాలో చెప్పుకున్నవి ఇవి 


మరి కొన్ని పచ్చళ్ళు చెప్పుకుందామా?

1. ఉల్లి పాయతో 

కావలసినవి:
పెరుగు 1 కప్పు 
ఉల్లిపాయ 1
పచ్చి మిర్చి 2
కొత్తిమీర తరుగు 2 tsps
చక్కెర  1/2 tsp
ఉప్పు తగినంత 
పసుపు 2 చిటికెలు 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలు

కర్వేపాకు  2  రెబ్బలు 
తయారు చేసే విధానం:
  • ముందుగా తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి
  • ఉల్లిపాయలు, పచ్చి మిర్చి సన్నగా తరిగిపెట్టు కోండి 
  • ఒక  గిన్నెలో పెరుగు  తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
  • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 
ఇలా పచ్చి ఉల్లిపాయ పచ్చడికి తెల్ల ఉల్లిపాయ ఐతే ఎక్కువ ఘాటు ఉండదు. చలువ చేస్తుందని అంటారు. అందుకే వేసవి లో ఈ పచ్చడి ఆరోగ్యానికి మేలు. ఎండా దెబ్బ తగలదు, గాల్పు కొట్టదు అని పెద్దలు చెపుతారు. తెల్ల ఉల్లిపాయ లేకపోతె మాములువి వాడుకోవాలి. 

2  ఇంకొక పద్ధతి: 

తాళింపు వేసుకున్న తరువాత అందు లోనే ఉల్లి తరుగు వేసి గులాబీ రంగు వచ్చే వరకు వేయించు కోండి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా చక్కెర వేస్తె రుచి రంగు రెండూ ఉంటాయి. 

ఇది చల్లారిన తరువాత మిగిలినవన్నీ వేసి కలుపుకోండి.

3 . క్యారట్ తో:

కావలసినవి:
పెరుగు 1 కప్పు 
క్యారట్ పెద్దది  1
పచ్చి మిర్చి 2
కొత్తిమీర తరుగు 2 tsps
చక్కెర  1/2 tsp
ఉప్పు తగినంత 
పసుపు 2 చిటికెలు 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలు

కర్వేపాకు  2  రెబ్బలు 
తయారు చేసే విధానం:
  • ముందుగ తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి
  • క్యారట్ కడిగి పై పెచ్చును తీసివేసి, తురుము కోండి 
  • పచ్చి మిర్చి సన్నగా తరిగిపెట్టు కోండి 
  • ఒక  గిన్నెలో పెరుగు  తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
  • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 

క్యారట్ పచ్చిగా ఇష్టం లేని వారు తాళింపు తో కొద్దిగా పచ్చి పోయేంత వరకు వేయించుకుని వేసు కోండి. 

మీ...అనామిక....

Monday, 2 April 2012

చల్ల చల్లని కూల్ కూల్ డ్రింక్స్ -1

వేడి వేడి వేసవిలో చల్ల చల్లని కూల్ కూల్ డ్రింక్స్ తాగితే మరి ఆ మాటే వేరు. అయితే బైట దొరికే సాఫ్ట్ డ్రింక్స్ కంటే మనం సహజంగా ప్రకృతి ప్రసాదించినవి వంటికి చలువ చేయటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు. 

ఈ కాలంలో నిమ్మ, పుచ్చ, దోస, మామిడి వంటివి ఎన్నో. రసం చేసుకు తాగితే పిల్లలకే కాదు పెద్దలికీ ఇష్టం. అవి కూడా కొద్దిగా మన సృజనను జోడించి కొత్తగా తాయారు చేస్తే ఇంకా బాగుంటాయి కదూ. 

మరి ఇలా రకరకాల పానీయాలు సులభంగా ఎక్కువ శ్రమ ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో, చెప్పుకుందాం.

చెరుకు రసాలు

చెరుకు, ఆ మాట చెపితే ఇప్పటికి మనకి నోరూరుతుంది.

చెరుకు గడ్డి జాతికి చెందినదంటే నమ్మ గలమా? దిని నుంచే బెల్లము, చక్కెర తయారుచేస్తారు. లక్ష్మి దేవికి ఇదంటే చాల ఇష్టం. అందుకని శుక్రవారం చెరుకు ముక్కలను అమ్మ వారికీ నైవేద్యం పెట్టండి.

చెరుకు ముక్కలుగా చేసి, పైన ఉన్న గట్టి బెరడును రిషి వేసి, లోపలి భాగాన్ని తినవచ్చు. దిని రసం మన అందరికీ  సుపరిచితమే.
 చెరుకు రసం తీసే యంత్రం 
చెరుకు రసం 

చెరుకు రసం వలన లాభాలు:
  • ఇది ప్రకృతి ప్రసాదించినది కబ్బతి సహజమైనది. దీనిలో ఎటువంటి కల్తీలు కల్మషాలు ఉండవు
  • ఎటువంటి ఇతర నష్టాలు (side effects) ఉండవు
  • దాహాన్ని తీరుస్తుంది
  • చాలవ చేస్తుంది
  • మంచి శక్తిని తక్షణమే ఇస్తుంది
  • ఎండా కాలం ఎండనుండి కాపాడుతుంది.
  • ఏ కాలమైన ఆరోగ్యానికి మంచిది
  • జీర్ణ క్రియను వృద్ది పరిచి అరుగుదలకు సహాయ పడుతుంది
  • కామెర్ల వాళ్ళకూ మంచిదే 
అయితే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు నిషిద్ధం.

గమనిక:

1. ఈ రసం బండి వాళ్ళ నుండి కొనేటప్పుడు, రసం తీసే పరికరం, వాడే గిన్నెలు పరిశుభ్రంగా ఉంచమని అడగండి. వాళ్ళ గిన్నెలు వాడ కుండా మనవి తీసుకుని వెళితే మంచిది. అందుకే ప్రొద్దున్నేవాళ్ళు మొదలు పెట్టగానే ముందుగా మనం రసం తీయిన్చుకుని- నీళ్లు, ఐస్, నిమ్మకాయ, అల్లం  లేకుండా- సీసాలలో నింపి వెంటనే ఫ్రిజ్జిలో పెట్టుకోవాలి. తరువాత మనకు కావాల్సిన రీతిలో రసాన్ని వాడుకోవచ్చు. ఫ్రిజ్జిలో పెట్టినా 6 - 7 గంటల కంటే ఉంచ కూడదు. 

ఎక్కువగా బండి వాళ్ళు వాడే నీళ్లు/ఐస్ వల్లనే మనకి రోగాలు. 

ఇప్పుడు ప్యాక్ లో కూడా రసం దొరుకు తోంది అనుకుంటాను. అదీ కాక పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల వద్ద మాల్ల్స్ వద్ద శుభ్రంగా తీసి ఇచ్చే వాళ్ళు ఉంటున్నారు. కొద్దిగా ఖరీదు ఎక్కువ. కాని ఆరోగ్యం ముందు మరి మనం ఆలోచించ కూడదు.

2. రసాన్ని బాగా చల్ల పరచి వాడండి.

3. నేను క్రింద చెప్పిన వాటిలో మీ రుచికి తగ్గట్లుగా తేనే ఇతర మసాలాలు వేసుకోండి.

4. తేనె ఆరోగ్యానికి మంచిదని చెప్పను. ఇష్టం లేక పొతే వాడవద్దు.

మరి ఈ క్రింది విధంగా వివిధ రకాలుగా రసాన్ని తయారు చేసుకోవచ్చు:

1. స్వీటీ :

కావలసినవి:
చెరుకు రసం  1 గ్లాసు 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • ఒక గ్లాసు లో రసం పోసి ఐస్ వేసి వెంటనే సర్వ్ చేయండి
  • తీపి సరిపోకపోతే కొద్దిగా చక్కర వేసుకోవచ్చు

2. మధు రసం:

కావలసినవి:
చెరుకు రసం  1  పెద్ద గ్లాసు
తేనె  1  టేబుల్ స్పూన్
నిమ్మరసం   1  టేబుల్ స్పూన్
ఉప్పు 1-2 చిటికెలు 
దాసినచెక్క పొడి  2-3 చిటికెలు 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • ఒక గిన్నెలో రసం, సగం తేనె, ఉప్పు వేసి  బాగా కలపండి 
  • ఒక పొడవాటి గ్లాసులో ఆ రసాన్ని పోయండి
  • ఐస్  క్యుబ్స్  లేదా క్రష్ద్ ఐస్ వేసి, వాటిపై మిగిలిన తేనె వేసి,  దాసినచెక్క  పొడి జల్లి వెంటనే సర్వ చేయండి
దాసినచెక్క కొద్దిగా వేయించి పొడి చేసుకుంటే బాగుంటుంది 

3. ట్యాంగీ ట్రీట్:

కావలసినవి:
చెరుకు రసం  1  పెద్ద గ్లాసు
అల్లం  రసం 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం   1  టేబుల్ స్పూన్
ఉప్పు 1-2 చిటికెలు 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • ఒక గిన్నెలో చెరుకు రసం,  అల్లం  రసంనిమ్మరసం, ఉప్పు వేసి  బాగా కలపండి 
  • ఒక పొడవాటి గ్లాసులో ఆ రసాన్ని పోయండి
  • ఐస్  క్యుబ్స్  లేదా క్రష్ద్ ఐస్ వేసి, వెంటనే సర్వ చేయండి

4. ఇండియన్ తడ్కా:

కావలసినవి:
చెరుకు రసం  1  పెద్ద గ్లాసు
నిమ్మరసం   1  టేబుల్ స్పూన్
తేనె  1  టేబుల్ స్పూన్
జీలకర్ర  1tsp
వాము   1/2 tsp
నల్ల  ఉప్పు 1/2 tsp 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • జీలకర్ర, వాము విడి విడిగా వేయించి పొడి చేసి పెట్టుకోండి
  • ఒక గిన్నెలో చెరుకు రసం, నిమ్మరసం, ఉప్పు వేసి  బాగా కలపండి 
  • ఒక పొడవాటి గ్లాసులో ఆ రసాన్ని పోయండి
  • ఐస్  క్యుబ్స్  లేదా క్రష్ద్ ఐస్ వేసి, దానిపై జీలకర్ర, వాము పొడిని చల్లి  వెంటనే సర్వ చేయండి

5. ఫ్రెష్ మింటి:

కావలసినవి:
చెరుకు రసం  1  పెద్ద గ్లాసు
నిమ్మరసం   1  టేబుల్ స్పూన్
తేనె  1  టేబుల్ స్పూన్
పుదినా ఆకులు  2-3 రెబ్బలు 
ఉప్పు 1-2 చిటికెలు 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • పుదినా ఆకులు బాగా కడిగి కొన్నింటిని దంచి రసం తీసుకోండి. అవసరం అనుకుంటే వడ పోసుకోండి. కొన్ని ఆకులు గర్నిషింగ్ (అలంకరణ) కోసం పెట్టుకోండి.
  • ఒక గిన్నెలో చెరుకు రసం, పుదినా రసం, నిమ్మరసం, సగ భాగం తేనెఉప్పు వేసి  బాగా కలపండి 
  • ఒక పొడవాటి గ్లాసులో ఆ రసాన్ని పోయండి
  • ఐస్  క్యుబ్స్  లేదా క్రష్ద్ ఐస్ వేసి, దానిపై మిగిలిన తేనె పుదినా ఆకులు వేసి సర్వే చేయండి.

6. స్పైసీ పంచ్

కావలసినవి:

చెరుకు రసం  1  పెద్ద గ్లాసు
నిమ్మరసం   1  టేబుల్ స్పూన్
తేనె  1  టేబుల్ స్పూన్
ఏలకులు, లవంగాలు, దాసిన చెక్క పొడి  1/2 tsp
నల్ల ఉప్పు 1-2 చిటికెలు 
ఐస్  క్యుబ్స్   2-3
లేదా 
క్రష్ద్ ఐస్  2 Tbsp

తయారుచేసే  విధానం: 
  • ఒక గిన్నెలో చెరుకు రసం, నిమ్మరసం, తేనె, ఉప్పు వేసి  బాగా కలపండి 
  • ఒక పొడవాటి గ్లాసులో ఆ రసాన్ని పోయండి
  • ఐస్  క్యుబ్స్  లేదా క్రష్ద్ ఐస్ వేసి, మసాలా  పొడి చల్లి వెంటనే సర్వ చేయండి

మరి మీరూ చేసి  చూడండి ....మరి కొన్ని వచ్చే టపాలలో 


మీ...అనామిక....