Sunday 27 May 2012

రంగవల్లి -67

18 చుక్కలు 2 వరుసలు, ఎదురు చుక్క 2 దాకా 



మీ...అనామిక....

Wednesday 23 May 2012

రంగవల్లి -66

ఇంతకు ముందు చెప్పుకున్న ఒక  చిన్న రంగవల్లి  (రంగవల్లి 55 లో):
దీనినే  కొద్దిగా పెద్దది చేసి వేస్తే  ఇలా ఉంటుంది:
మూడు స్తంభాలు దగ్గెరగా  వేయాలి. అప్పుడు ఒకటే పెద్ద ముగ్గులాగా ఉంటుంది..


మీ...అనామిక....

రంగవల్లి -65

సీతాకొక  చిలుకల ముగ్గు 



మీ...అనామిక....

Tuesday 22 May 2012

ఊరగాయలు -2-మామిడి కాయతో


నేను ముందుగా మన ఆంధ్రా ఊరగాయలు చెప్తాను. తరువాత వేరే ప్రాంతాల వారివి కూడా చెప్పుకోవచ్చ్సును.

పచ్చడి పెట్టె ముందు:
కాయలను కోసేందుకు కత్తి  పీట  వేరుగా ఉంటుంది.
  1. మామిడి కాయలు ముచికలు తరిగి నీళ్ళలో 1-2 గంటలు నానపెట్టండి. సొన అంతా కారి పోతుంది. 
  2. కాయలను బాగా కడిగి ఒక నూలు బట్టతో తుడిచి ఆరపెట్టండి. తడి లేకుండా ఆరిపోవాలి. 
  3. ముక్కలు కొట్టేటప్పుడు, నలగ కూడదు. పెచ్చు (టెంక) ఉండాలి. లేదా పచ్చడి నిలవ ఉండదు.ముక్క సైజు మీ ఇష్టం. కాని మరి పెద్దవి కాకుండా ఉంటేనే మంచిది. పెచ్చులు లేని ముక్కలను వేరు చేయండి. వాటితో వేరే పచ్చడి పెట్టుకోవచ్చు. 
  4. ప్రతీ ముక్కకీ ఉన్న జీడిని , పొరని తొలగించాలి.

అన్ని ముక్కలు పచ్చడికి తయారు.

1.  ఆవకాయ 

కావలసినవి:
మామిడి కాయలు   15  మీడియం సైజు 
ఆవ పొడి   1 కి 
మిరప పొడి  1కి 
ఉప్పు  1కి 
నువ్వుల నూనె  1+1/2 కి 
పసుపు  2-3 గుప్పెళ్ళు 
మెంతులు  1  గుప్పెడు 
తెల్ల వినెగర్  1/2 లి 

విధానం: 
  • కొలత ఏదైనా అంటే, గ్లాస్, కప్పు లేదా కిలో లెక్క అయినా ఆవ, కారం ఉప్పు సమంగా తీసుకుంటారు. 
  • ముక్క పులుపుని బట్టి, వీటి పరిమాణాన్ని ఎక్కువ/తక్కువ చేసుకోవచ్చును. అంటే ముక్క ఎక్కువ పులుపు అనిపిస్తే, ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. 
  • ఉప్పు అంతా ఒక్క సారి వేసుకోకుండా, సగం వేసుకుని రుచి చూసి తక్కువైతే కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకొండి.
  • కాయ సైజు ను బట్టి పొడులు ఎక్కువ తక్కువ తీసుకోండి.
  • పొడులన్నీ(ఆవ, మిరప, ఉప్పు, పసుపు) ఒక పెద్ద పళ్లెం కాని బేసిన్ లో కాని వేసుకోండి. అన్ని  బాగా  కలేసేటట్లు కలపండి. 
  • మెంతులు కూడా వేసి  కలపండి.
  • కొద్ది కొద్దిగా నూనె వేస్తూ పొడి కొద్దిగా తడి అయ్యేటట్లు కలపండి. అంటే 250 గ్రా సరి పోవచ్చు. మిగిలిన నూనె  విడిగా పెట్టుకోండి.
  • కొన్ని మామిడి ముక్కలు ఈ పొడిలో వేసి దోర్లించండి. ముక్కలకి బాగా పిండి పట్టాలి. 
  • ఒక జాడీలో ముందుగా కొంత పిండి వేసి పైన ఆ ముక్కలను వేయండి. కొద్దిగా పొడి ఒక పొరలాగా జల్లండి. 
  • మరల కొన్ని ముక్కలను పిండిలో దొర్లించి జాడీలో వేయండి. మరల కొంత పిండి వీటిపై వేయండి. 
  • ఇలా ముక్కలు, పిండి అయిపోయేంత వరకు చేయండి. 
  • ఇప్పుడు జాడిని పొడి బట్ట పెట్టి తుడిచి మూత పెట్టండి. దీని పై ఏదయినా ఒక బేసిన్ బోర్లించి, నీళ్ళు తేమ లేనీ చోట పెట్టేయండి. 
  • మూడు రోజుల తరువాత, జడిలోని ఆవకాయను అంతా ఒక పెద్ద పళ్ళెం లోకి తీసుకుని, బాగా కలపాలి. ఇప్పటికి ఊట వచ్చి ఉంటుంది. 
  • కొద్దిగా రుచి చూడండి. ఉప్పు, కారం, ఆవ, ఏది తక్కువ అనిపించినా అది కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలపండి. 
  • వినెగర్ కుడా వేసి బాగా కలపండి. ఇది ముక్క మెత్త పడకుండా ఉంచుతుంది. కారం కూడా ఎర్రగా ఉంటుంది. 
  • మళ్లి జాడీలో వేయండి. 
  • మిగిలిన నూనెను అంతా జాడీలోని పచ్చడి పైన పోసేయండి. కనీసం అంగుళం దాక పైన నునె ఉండాలి. 
  • జాడి పైన మూత పెట్టి, గుడ్డతో వాసిన కట్టండి. పైన ప్లాస్టిక్ కవర్ కూడా కడితే, గుడ్డ మీద దుమ్ము పడదు. 
  • కావలిసినప్పుడు, తడి లేని గరిటెతో తీసుకుని చిన్న సీసాలలో, జాడిలలో పెట్టుకోండి.
నోరూరించే ఆంధ్ర ఆవకాయ రెడి.

2. శెనగల ఆవకాయ
పైన చెప్పినట్లు అంతా అదే విధానం కాక పొతే 1 కప్పు శెనగలు (దేసవాళి రకం) మెంతులుతో పాటు పిండిలో వేసుకోవాలి.

కాని శెనగలు వేస్తే పచ్చడి లోని ఊట పిల్చేసి, గట్టిగా ఎండి పోయినట్లు అవుతుంది. అందుకని కొద్దిగా వేసుకోండి.

3. పెసర ఆవకాయ 
పైన మామూలు ఆవకాయకు చెప్పిన విధానమే. ఆవ బదులు పెసర పప్పు బాగా ఎండా పెట్టి పిండి పట్టుకుని వాడుకోవాలి. 1-2 గుప్పెళ్ళు ఆవ పొడి కావాలనుకుంటే వేసుకోవచ్చును. ఇది కమ్మగా ఉంటుది. పిల్లలు ఇష్టంగా తింటారు. తక్కువ కాయలు పెట్టుకుంటారు కాబట్టి, కరం, ఉప్పు, పెసర పిండి అన్నీ తగ్గ్గట్టుగా వేసుకోండి.


మీ...అనామిక....

రంగవల్లి -64




మీ...అనామిక....

Sunday 20 May 2012

ఊరగాయలు-1-మామిడి కాయతో


ఆంధ్రా అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఊరగాయలు. మనం ఎన్నో రకాల ఊరగాయలు పెట్టుకుంటాం. ఆవకాయ, గోంగూర, పండుమిరప కారం, ఉసిరి కాయ,చింతకాయ ఇలా ఎన్నో పచ్చళ్ళు. మనం అన్ని రకాల ఊరగాయలు చెప్పుకుందాం. మన ఆంద్ర పధతే కాక ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుకునే పధతులు కూడా చెప్పుకుందాం.

మామిడి కాయతో :

మరి ఆంధ్రుల అభిమాన ఊరగాయలలో ఒకటి అయిన మామిడికాయ ఊరగాయలతో మొదలు పెడదాం.
ముందు మాట:
ఊరగాయలంటే ఏడాది పాటు ఉండాలి. పచ్చడి పెట్టేటప్పుడు కొద్దిగా శ్రద్ద వహిస్తే పచ్చడి, రుచిగా, శుచిగా చక్కగా ఉంటుంది. కొంచెం అశ్రద్ధ చేసినా, పచ్చడి సరిగ్గా కుదరదు. నిలువ ఉండదు. సమయం, డబ్బు అన్ని వృధా. అందుకని, క్రింద చెప్పిన వాటిని, పాటించండి.
నాకు మాత్రం పచ్చళ్ళు పెట్టటం అనేది ఒక యఙ్ఞం వంటిదే. మా అమ్మమ్మ నాకు నేర్పింది అదే- ఏ పని చేసినా చాల శ్రధ్ధగా, ఓర్పు గా చేయాలి అని.
  • పచ్చడికి వాడే సామగ్రి అంతా మేలైనవి వాడాలి. ఇక్కడ డబ్బు ఆదా చేద్దామనుకుంటే పచ్చడి గురించి మర్చి పోండి. 
  • మామిడి కాయలు రకరకాలవి ఉంటాయి.మంచి మేలు రకానివి ఎన్నుకోవాలి.ఆవకాయకి మాత్రం బంగినపల్లి, పెద్ద/చిన్న రసాలు, జలాలు, నీలం రకాలు మంచివి. చాల మంది, నాటు రకం అని, ఇంకా వేరే రకాలు వాడతారు. రుచి బాగుండదు. ముక్క తొందరగా మెత్త పడుతుంది. నేను చాల అనుభవంతో చెపుతున్నాను. 
  • మామిడి కాయాలు ముదురు ఆకుపచ్చ రంగులో నొక్కితే గట్టిగా ఉండాలి. పగుళ్ళు, దెబ్బలు లాంటివి ఉండకూడదు. మెత్తగా ఉండకూడదు.
  • కాయలు తింటే కరకర లాడుతో ఉండాలి. బాగా పుల్లగా ఉండాలి. కాయ ముదురుగా ఉండి, టెంక గట్టిగా ఉండాలి. టెంక ముదురుగా ఉండాలి. 
  • మాగాయకి మాత్రం ఏ రకం అయినా వాడుకోవచ్చును. కొద్దిగా పండినా సరే. కొద్దిగా మెత్తగా ఉన్నా సరే. బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది. 
  • మిరపకాయలు, ఆవాలు, ఇతర దినుసులు, మంచివి కొని, శుభ్రం చేసుకుని బాగా ఎండ పెట్టుకోవాలి. పచ్చడి పెట్టె రోజు ముందు రోజు పొడి చేసుకుని పెట్టుకుంటే, బాగుంటుంది. మేమైతే, కారం, ఆవ, అన్ని పొడులు ఇంట్లోనే మిక్సిలో పొడి చేసుకుంటాము.
  • రెడి మేడ్ వాడితే, మంచి బ్రాండువి వాడండి. లేదా కల్తి ఉంటుంది. 
  • మిరపకాయలు నేను రెండు రకాలవి వాడతాను. గుంటూరు రకం కారం ఎక్కువగా ఉంటుంది. అది రుచికి. కారం చాలా తక్కువగా ఉండి మంచి రంగు ఉన్నవి (కాష్మీరు, వరంగల్ లేదా బ్యాదగి)రంగు కోసం. మీరు తినే కారాన్ని బట్టి ఏ రకం ఎంత వాడుకోవాలో పాళ్ళు సరి చూసుకోండి. 
గుంటూరు మిరప -కారం ఎక్కువ 
ఇవి రంగు కోసం 
  • ఆవాలు నేను లావువి వాడతాను. సన్నవి బాగా ఘాటు ఉండి ఎక్కువ వేడి చేస్తాయి. ఏది వాడుకుంటారో మీ ఇష్టం.
  • ఉప్పు ఏ పచ్చడికైనా చాలా ముఖ్యం. తక్కువైనదా పచ్చడి పాడైపోతుంది. ఎక్కువైందా దానిని సరి చేయటానికి కష్టాలు పడాలి.
  • టేబుల్ సాల్ట్ లేదా అయోడిన్ ఉన్న ఉప్పు వడ వద్దు. మాములు రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి. 
  • రాళ్ల ఉప్పుని బాగా ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలి. పొడి చేసినది కూడా దుకాణాలలో దొరుకుతాయి.
  • నూనె -నువ్వుల నునె వాడితే చాలా మంచిది. పప్పు నునె అంత రుచి ఉండదు. నూనె తక్కువ అయితే పచ్చడి నిలువ ఉండదు. తప్పనిసరిగా కావలసినంత వాడవలసినదే.
  • పచ్చడి కోసం వాడే పళ్ళాలు, గరిటెలు, నిలువ ఉంచడానికి వాడే జాడీలు, సీసాలు, ముందుగానే బాగా కడిగి ఆరబెట్టి, ఎండలో ఒకటి -రెండు గంట అయినా పెట్టి ఉంచాలి. 
  • స్టీలు, ప్లాస్టిక్ కంటే, గాజు, పింగాణివి మంచివి. చెక్క గరిటెలు పొడవుగా బలంగా ఉన్నవి కలపడానికి బాగుంటాయి. 
  • కాని చెయ్యి పెట్టి చేసినట్లుగా ఏదీ ఉండదు.పచ్చడి చేతితో కలిపేటప్పుడు ముందుగా చేతులకి (మోచేతులదాకా) నువ్వుల నూనె బాగా రాసుకోండి. చేతులు మండవు. లేదా గ్లవ్సు వేసుకోండి.
  • మామిడి కాయలు తెచ్చుకునే ముందే అన్నీ తయారుగా పెట్టుకోవాలి. తెచ్చిన తరువాత ఎక్కువ సేపు ఉంచితే పచ్చడి సరిగ్గా రాదు. అందుకని హడావిడి పడకుండా అన్నీ అమర్చుకుని పెట్టుకోవాలి.
  • పచ్చడి కలిపే ముందు, వంట గది, టేబులు, గరిటెలు, ఇతర సామానలు,అన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. సామాగ్రి అంతా అందు బాటులో ఉండేటట్లు ఉంటే పని త్వరగా అవుతుంది. మొదలు పెట్టిన తరువాత మధ్యలో అవి ఇవి అని వెతుక్కుని, ఆ చేతులతో అవి ఇవి ముట్టుకుంటే పచ్చడి నిలువ ఉండదు.
  • పచ్చడి కలిపేటప్పుడు, సావకాశంగా చేసుకోవాలి. పక్కన ఇంకొకరు ఉంటే చాలా సుళువు. పచ్చడి కొద్దిగా అయితే సరే గాని,ఒక్కరే అయితే ఎక్కువ మోతాదులో పెట్టుకోవటం కష్టం.
అన్ని సిద్దం చేసుకోండి. ఇంకా ఊరగాయలు  పెట్టుకోవటమే...


మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు-5

పచ్చి మిరపకాయలు మనం వారానికి ఒక సారి కొని తెచ్చుకుంటాం. అవి ఎక్కువగా నిలువ ఉండవు. నిలువ ఉండాలంటే ఇలా చేయండి:

  • కోనే టప్పుడు తాజాగా ఉన్నవి తీసు కోండి. వడిలి పోయి, కుళ్ళి పోయి ఉండకూడదు. 
  • ఇంటికి వచ్చిన తరువాత , వాటిని నీళ్ళలో బాగా కడిగి, ఒక పలుచని నూలు వస్త్రం పైన ఆరబెట్టండి. 
  • వడిలినవి/ కుళ్ళినవి ఏరి వేయండి. 
  • తరువాత తొడిమలు తీసి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి గట్టిగా ముత పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి. 
  • వరం పది రోజుల దాకా ఉంటాయి. 
కొన్ని సార్లు పచ్చి మిరపకాయలు పండి నట్లు లేదా వడలినట్లు అవుతాయి. మనం పారేస్తాం. అలా కాక ఎండలో పెట్టి బాగా ఎండే దాకా ఉంచండి. దీనిని పొడి చేసి, కూరల్లో వాడుకోవచ్చును.



మీ...అనామిక....

వాము-ఆవ మిరపకాయలు

ముద్ద పప్పు, పెరుగన్నం, లేదా మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ ఇలా ఏదైనా అన్నం తో తినవలసి వస్తే, కొద్దిగా కారంగా ఏదైనా పక్కన ఉంటె బాగుంటుంది అని అనుకుంటాం.ఇదిగో,వాము మరియు ఆవ మిరపకాయలు బాగుంటాయి. చేసి చూడండి.
ముందుగా :
  • మిరపకాయలు పచ్చివి, ఆకుపచ్చగా ఉండి, వెడల్పుగా, పొట్టిగా ఉంటే బాగుంటుంది. మరి కారం ఉన్నవి వద్దు. మీరు తినగలిగితే సరే. 
  • తాజాగా ఉన్నవి, తొడిమెలతో ఉన్నవి తీసుకోండి. 
  • నీళ్ళల్లో బాగా కడిగి, తడి లేకుండా బట్టతో తుడిచి కొంచెం సేపు ఇంట్లో ఆరబెట్టండి . తడి ఉంటే నిలువ ఉండవు. 
  • నిలువుగా చీరి అంటే గాటు పెట్టి లోపలి గింజలను అవసరం అనుకుంటే తీసివేయండి. 
1. వాము మిరపకాయలు 
వాము 

కావాలసినవి:
పచ్చి మిరపకాయలు  100 గ్రా 
వాము  50 గ్రా
పప్పు నునె   50 గ్రా 
పసుపు  1/2 టీ  స్పూన్ 
ఉప్పు తగినంత 
నిమ్మకాయ  1 

చేసే విధానం :
  • వాము ని పొడి చేసుకోండి 
  • వాము, ఉప్పు, పసుపు బాగా కలపండి
  • నిమ్మరసం తీసి ఈ పొదిలో వేసి కలపండి 
  • పచ్చి మిరపకాయలను నిలువుగా చీరి(గాటు పెట్టి) ఈ పొడిని కూరండి.
  • ఒక గాజు సీసాలో మిరప కాయలను పెట్టి పై నుండి  నునె   పోయండి. బాగా కుదపండి. నునె అన్ని కాయలకు పట్టేలాగా అన్న మాట. 
  • 2-3 గంటలు ఉరిన తరువాత తినవచ్చు.
  • వారం పాటు ఉంటాయి. కాని నిమ్మ రసం వాడాము కనుక ఫ్రిజ్ లో పెట్టుకోండి.

2. ఆవ మిరపకాయలు 
ఆవ పొడి 

పైన చెప్పినట్లుగానే చేయాలి. వాము బదులు 50 గ్రా ఆవ పొడి వాడండి.



మీ...అనామిక....

రంగవల్లి-62


11- 7 వరుసలు, 9, 7 చుక్కలు. 


మీ...అనామిక....

మసాలా పాపడ్


మనకి టీ తో తినటానికి కాని లేదా సాయంకాలం తోచనప్పుడో అలా నోట్లో ఏదైనా వేసుకోవాలని అని పిస్తుంది. ఇంటికి అనుకోకుండా అతిధులు వచ్చినా లైట్ గా పెట్టటానికి కాని ఈ మసాలా పాపడ్ పనికి వస్తుంది. సూప్ తో పాటు స్టార్టర్ గా కూడా పనికి వస్తుంది. డిన్నర్ ఇచ్చినా , లేదా చిన్న పార్టీ ఇచ్చినా ఇది ఒక ఐటంగా పెట్టుకోవచ్చు. 

సాధారణంగా అప్పడాలంటే కేవలం సామ్బారుతో తినేందుకే అని అనుకుంటాం. అల కాకుండా ఇలా వెరైటి గా కూడా తినవచ్చును. అప్పడా లలొ రక రకాలైనవి ఉన్నాయి. మాములు తెల్ల అప్పడాలు (మద్రాసువి) కాకుండా మన ఆంధ్రలో చేసుకునే, మినప, పెసర, శనగ పిండివి అదీ మసాలా వేసినవి అంటే, ఎర్రకారం, మిరియాలు, ఇంగువ, వెల్లుల్లి ఇలాంటివి వివిధ రకాలవి అయితే విడిగా తినటానికి బాగుంటాయి. మన కోస్తా ప్రాంతాలలో నువ్వులు అద్దినవి కూడా ఉంటాయి. 

ఇలాగే, పంజాబీ వారివి కూడా ఉంటాయి. 

నునె ఆరోగ్యానికి మంచిది కాదు. అందు కని నునె లేకుండా నిప్పుల పైన కాని, గాస్ స్టవ్ పైన కాని కాల్చుకోవచ్చును. మైక్రోవేవ్ ఓవెన్ ఉంటె ఇంకా మంచిది. చిటికలో చేసుకోవచ్చు. ఒక చిన్న కుంచె తో కాని లేదా చేతితో కాని అప్పడానికి రెండు వైపులా కొద్దిగా నునె రాసి కాలిస్తే నునెలో వేయించినట్లు గానే ఉంటాయి.

మినప/పెసర ఎర్ర కారం అప్పడాలు. 
 మినప+శెనగ పిండి, ఎర్ర కారం, మిరియాలు వేసిన అప్పడాలు.

వాటిని నిప్పు పై కాల్చి/నునె లో వేయించి, సన్నగా తరిగిన ఉల్లి, కీరా దోస, టొమాటో  ముక్కలు, కొత్తిమీర వేసి, చాట్ మసాలా చల్లాండి. నిమ్మకాయ పిండి వెంటనే వడ్డించండి. ఇదే మనం హోటల్ లో తినే స్టార్టర్. అప్పడాలు ఎక్కువ కారం లేకుండా ఉంటే, పిల్లలు కుడా ఇష్టంగా తింటారు. చలి కాలం అయితే వేడి వేడి సూప్ తో పాటు తినవచ్చు.

అప్పడాన్ని నాలుగు ముక్కలుగా చేసి తరువాత కాల్చి పైన ఇవన్ని వేసి కూడా సర్వ చేయవచ్చు.

మీ...అనామిక....

రంగవల్లి -61

మినాల  ముగ్గు 

ఇది వేయటం చాల సులభం. 
11 నుండి 1 వరకు ఎదురు చుక్క..


మీ...అనామిక....

రంగవల్లి -60


11 చుక్కలు 5 వరుసలు, 9,7,5. స్వస్తిక మాత్రం నేను ఎడమనుండి కుడికి వేసాను. అది కుడి నుండి ఎడమకు ఉండాలి. కాబట్టి. సరి చేసుకోండి.


మీ...అనామిక....

Sunday 13 May 2012

గోమిని కథ

బారత నారీమణులు


మన భారత దేశం ఎంతో గొప్ప దేశం. మన సంస్కృతి, సభ్యత, నాగరికత గురించి ఒక్క సారి తలుచుకుంటే మనం ఇతరులకంటే, ప్రాచీన కాలం నుండే ఏంతో ఉన్నతంగా ఉన్నామని గర్వంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఇవన్ని మనం మర్చి పోయాం. పురుషులు, స్త్రీలు పిల్లలు ఇలా అందరూ ధర్మానికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి వారి సత్ప్రవర్తన, త్యాగ బుద్ధీ,  ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ధర్మాన్ని పాటించే గుణం, ఇలా ఎన్నో సుగుణాల మూలంగా మనకి ఇనాటికి ఆదర్శంగా నిలిచారు. 

అలనాటి సీతా, సావిత్రి, అనసూయ, ద్రౌపది, సత్యభామ, లోపాముద్ర, మైత్రేయి...ఝాన్సీ లక్ష్మి బాయి, రాణి రుద్రమ, మీరా, సక్కుబాయి....ఎందరో  నారీమణులు ....ఇలా చాలామంది ఉన్నారు. మరి బాగా తెలిసిన వాళ్ళు కొందరైతే, చాలామంది మనకి తెలియని వారూ ఉన్నారు. 

అలాగే, ఇనాడు మనం టీవీ లో చూస్తునట్లుగా మంధర లాంటి వాళ్లు కూడా ఉన్నారు.

పురాణాలలో, ఇతిహాసాలలో, కధలలో, కావ్యాలలో నాయికలు నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తారు. వారి గురించి చదివినవి మననం చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకో వచ్చు. ఈ శీర్షికలో ఇలా నాకు తెలిసిన  నారీమణులను మీకూ పరిచేయం చేస్తాను. 
గోమిని కథ 

గోమిని దశ కుమారచరితం లో ఒక నాయిక. ఆమె గురించి చెప్పిన కథ ఇది. ఇదంతా కేవలం కల్పితం మాత్రమే అంటారు. ఎంత కల్పితమైనా ఎక్కడో, ఎవరో దీనికి మూలం ఉండే ఉంటారు. సరే ఇక కథలోకి;

ద్రావిడ దేశంలో కంచి అనే పట్టణంలో శక్తిసారుడు అనే ఒక వ్యాపారి ఉండే వాడు. అతనికి 18 ఏళ్ల వయసు కానీ చాలా ధనవంతుడు. వంటరివాడు. అందుకని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరబడదాం అని అనుకున్నాడు. తనే ఒక యోగ్యమైన కన్యను వెతికి పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు. ఒక ప్రస్త(1 KG బరువు?) వడ్లు మూట గట్టుకుని దేశాటనికి బయలుదేరాడు. తనని ఒక జ్యోతిష్యుడని పరిచయం చేసుకునే వాడు.

మంచి కన్య కనిపిస్తే వారిని తన దగ్గెర ఉన్నవడ్లు వండి పెట్టమని అడిగేవాడు. కొంతమంది నవ్వి పోయేవారు.ఉత్త వడ్లతో భోజనం ఎలా పెడతాం అని. చాలా మంది సమాధానం కూడా చెప్పేవారు కాదు. అలా తిరుగుతూ కావేరి నది ఒడ్డున ఉన్న ఒక ఊరికి చేరుకున్నాడు.

ఆ ఊరిలో గోమిని అనే అమ్మాయి ఉన్నది. తల్లి తండ్రులు, ఆస్తీ, పోయినా ఆమె దాదీ ఆమెని పెంచి పెద్ద చేసింది. శక్తిసారుడు ఆమె ఇంటి అరుగుపై కుర్చుని సేద తిరుతున్నాడు. అప్పుడు దాదీ అతను జ్యోతిషుడు అని తెలిసి శక్తిసారుని వద్దకు గోమినిని తీసుకు వచ్చి, ఆమె చేయి చూసి భవిష్యత్తు చెప్పమన్నది. 

ఆమె చేయి చూసిన శక్తిసారుడు ఆమె చాలా అదృష్టవంతురాలు అని గ్రహించాడు. చూడటానికి కూడా చాలా పొందికగా ఉన్నది.ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. గోమినిని తన వద్ద ఉన్న వడ్లతో భోజనం చేసి పెట్టమని అడుగుతాడు.

ఆమె తన దాదీ వంక ఒక సారి చూసి, వడ్ల మూట అందుకుని, శక్తిసారుని కి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి, కాసేపు అరుగు మిద కుర్చోమన్నది. 

వడ్లను నేలపై చేత్తో రుద్ది, జాగ్రత్తగా లోపలి ధాన్యపు గింజలు విరగకుండా, పైన ఉన్న ఊకను వేరు చేసింది. ధాన్యాన్ని చెరిగి ఆ ఊకను దాదీకి ఇచ్చి, బంగారు నగలు తాయారు చేసుకునే వారు నగలను శుభ్రం చేసుకోవడానికి వాడుతారు కాబట్టి, వారికీ అమ్మి ఆ డబ్బుతో కట్టెలు, ఒక కుండ, రెండు మట్టి పాత్రలను తెచ్చి పెట్టమన్నది. 

దాదీ అన్నీ తెచ్చి ఇచ్చింది.పొయ్యి అలికి,కొన్ని కట్టెలు పెట్టి,రాజేసి, అగ్నిదేవునికీ, పొయ్యికీ, నమస్కరించి కుండలో ధాన్యం పోసి, తగినంత నీరు పోసి పొయ్యి పైన ఉంచింది. అన్నం ఉడకగానే, కట్టెలను అర్పివేసింది. కట్టెలు బొగ్గులుగా మారిపోయాయి. ఆ బొగ్గులను దాదీ కి ఇచ్చి కాయగూరలు, నెయ్యి ఇతర సామాగ్రి కొని తీసుకురమ్మని చెప్పింది. 

దాదీ అవన్నీ తీసుకుని రాగానే, మిగతా వంట చేసి, శక్తిసారుని స్నానం చేసి భోజనానికి రమ్మని చెప్పింది. చక్కటి కమ్మని విందు భోజనం పెట్టింది. త్రాగటానికి సుగంధభరితమైన చల్లని నీరు ఇచ్చింది.

శక్తిసారుడు చాలా ఆనంద పడి గోమినిని వివాహమాడి తన ఇంటికి తీసుకుని పోతాడు. తన గృహానికి ఆమెను యజమానురాలిని చేసి, సర్వాధికారాలు ఇస్తాడు. తన సహచర్యంలో శక్తిసారుడు ఆనందంగా జీవితం గడుపుతాడు. గృహిణి మీదే గృహం ఆధారపడి ఉంటుంది.

మరి పూర్వం కూడా మన వాళ్ళు ఎంత తెలివిగా ఇల్లు-వాకిలి చక్కదిద్దుకునే వారు. ఏ మేనేజ్మేంట్ పట్టాలు పుచ్చుకోలేదు. తల్లీ, ఇంట్లోని ఇతర పెద్దవాళ్ళ, పెళ్ళైన తరువాత అత్తగార్ల నుండి అన్ని నేర్చుకునేవారు. ఆడవాళ్ళు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఇల్లు చక్క దిద్దుకోలేకపోతే ఆ పరివారం లోని వారు సంతోషంగా ఉండలేరు. అలా అని భర్తలకు బాధ్యత లేదని కాదు. మనకి చాలా ఓర్పు, నేర్పు, సహనం ఉంటాయి. అది సృష్టి ధర్మం.

మరి నాకు గోమిని కధలో ఆమె చూపించిన తెలివి నచ్చింది. మీకూ ?

మీ...అనామిక....