మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, శనగ, బియ్యం, గోధుమ వంటి పిండ్లు పురుగులు పడతాయి. మైదా ఐతే మరి కష్టం. కొద్దిగా పురుగు పడ్తే, బాగా జల్లించి ఎండలో పెట్టి మళ్ళి వాడుకోవచ్చును. కాని ఎక్కువగా ఉంటె ముక్క వాసన వేస్తాయి. అటువంటి పిండ్లని తినటానికి వాడలేము. వండిన తరువాత కూడా ముక్క వాసన ఉంటుంది. అందుకని పార వేస్తాము. డబ్బు దండగ అని భాద పడతాము.
అలాంటి పిండ్లను జల్లించి ఎండ పెట్టి ఒక డబ్బాలో పెట్టి ఉంచుకోండి. దీనిని క్రింది విధంగా ఉపయోగించండి.
- వంటింట్లో కాని, దేవుని మదిరంలో కాని అప్పుడప్పుడు చేయి జారి నూనె వలుకుతుంది. ఎక్కువగా వోలికితే, ముందు బ్లాటర్ పేపరు కానీ మాములు న్యూస్ పేపర్ కానీ వేసి, లేదా బట్ట తోనో అక్కడే అద్ది నూనె తీసివేయండి. అటు ఇటు తుడవద్దు. నేలంతా అవుతుంది. ఇలా తీసి వేసినా ఇంకా నూనె జిడ్డు ఉంటుంది. ఇప్పుడు ఆ మారక పై ఈ పిండిని జల్లండి. మరకంతా పరుచుకునేలాగా బాగా వత్తుగా జల్లి కొంచెం సేపు ఆగి, పిండిని తీసివేసి, నేలను తుడుస్తే జిడ్డు పోతుంది.
- తక్కువగా వోలికితే, వెంటనే అక్కడ వత్తుగా పిండి చల్లేయండి. తరువాత పిండిని తీసివేసి, అక్కడ తుడిచేయండి. జిడ్డు త్వరగా వదులుతుంది.
- జిడ్డు పట్టిన సామాన్లు-బాండి, మూకుడు, నూనె క్యారియర్లు, నేతి క్యారియర్లు, పచ్చళ్ళ జాడీలు/సీసాలు, గరిటెలు, దీపపు కుందులు, దోశెల పెనం ఇలా ఏవైనా జిడ్డు ఉన్నవి కడగాలంటే, చాల కష్టం. అందుకని ముందు ఈ పిండి తో బాగా తుడిచి, తరువాత సబ్బూ, వేడి నీటి తో కడగండి. చాల సులభంగా జిడ్డు వదులుతుంది. జిడ్డు వదిలిన దాకా రెండు మూడు సార్లు ఎక్కువ పిండితో రుద్దండి. మనకి శ్రమ తక్కువ, చేతులు పాడవవు. అసలు వేడి నీటి అవసరం అంతగా ఉండదు.
- నేనైతే వారాని కో రెండు వారాలకో, గుప్పెడు పిండి తీసుకుని, పచ్చళ్ళ జాడీలు, నూనె, నేతి క్యారియర్లు, నూనె-నేతి గిన్నెలు బయట వైపున రుద్ది తరువాత ఒక పొడి బట్టతో తుడిచి వేస్తాను. ఇలా చేయటం వలన వాటిని మాటి మాటికి కడగనవసరం లేదు. నూనె-నేతి క్యారియలనుండి జిడ్డు కారి అవి పెట్టిన చోటంతా జిడ్డు అవుతుంది. అల అవకుండా మనం కాపాడుకోవచ్చు.
- నూనె, నేతి క్యారియర్లు గిన్నెలు పెట్టే చోటు కూడా ఈ పిండితో తుడిచి చూడండి జిడ్డు మాయం.
- వంట గట్టు, పొయ్యి, టేబుల్ ఇలా జిడ్డు ఉన్న ప్రదేశం ఏదైనా సరే ఈ చిట్కా బాగా పని చేస్తుంది.
- భూత దయ అని అనుకునే వారు, ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు కలిపి ఉండలుగా చేసి, చీమలు, కీటకాలు ఉన్నదగ్గెర రోజు పెడితే మంచిది.
గమనిక: పిండీ, తుడిచే వస్తువులు/ప్రదేశం పొడిగానే ఉంచండి. ముందుగా నీళ్ళు పోస్తే జిడ్డు వదలదు.
మరి పురుగు పట్టిందని పిండిని పారేసే బదులు ఇలా ఉపయోగించుకోవచ్చు. ఖరీదులు పెట్టి, కెమికల్ ఉన్న సబ్బులు కొని, వాడితే చేతులు దెబ్బతింటాయి. దాని బదులు ఈ చిట్కా శ్రమ తక్కువ, సులభం కూడాను కదా.
మీ...అనామిక....
No comments:
Post a Comment