Sunday 13 May 2012

గోమిని కథ

బారత నారీమణులు


మన భారత దేశం ఎంతో గొప్ప దేశం. మన సంస్కృతి, సభ్యత, నాగరికత గురించి ఒక్క సారి తలుచుకుంటే మనం ఇతరులకంటే, ప్రాచీన కాలం నుండే ఏంతో ఉన్నతంగా ఉన్నామని గర్వంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఇవన్ని మనం మర్చి పోయాం. పురుషులు, స్త్రీలు పిల్లలు ఇలా అందరూ ధర్మానికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి వారి సత్ప్రవర్తన, త్యాగ బుద్ధీ,  ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ధర్మాన్ని పాటించే గుణం, ఇలా ఎన్నో సుగుణాల మూలంగా మనకి ఇనాటికి ఆదర్శంగా నిలిచారు. 

అలనాటి సీతా, సావిత్రి, అనసూయ, ద్రౌపది, సత్యభామ, లోపాముద్ర, మైత్రేయి...ఝాన్సీ లక్ష్మి బాయి, రాణి రుద్రమ, మీరా, సక్కుబాయి....ఎందరో  నారీమణులు ....ఇలా చాలామంది ఉన్నారు. మరి బాగా తెలిసిన వాళ్ళు కొందరైతే, చాలామంది మనకి తెలియని వారూ ఉన్నారు. 

అలాగే, ఇనాడు మనం టీవీ లో చూస్తునట్లుగా మంధర లాంటి వాళ్లు కూడా ఉన్నారు.

పురాణాలలో, ఇతిహాసాలలో, కధలలో, కావ్యాలలో నాయికలు నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తారు. వారి గురించి చదివినవి మననం చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకో వచ్చు. ఈ శీర్షికలో ఇలా నాకు తెలిసిన  నారీమణులను మీకూ పరిచేయం చేస్తాను. 
గోమిని కథ 

గోమిని దశ కుమారచరితం లో ఒక నాయిక. ఆమె గురించి చెప్పిన కథ ఇది. ఇదంతా కేవలం కల్పితం మాత్రమే అంటారు. ఎంత కల్పితమైనా ఎక్కడో, ఎవరో దీనికి మూలం ఉండే ఉంటారు. సరే ఇక కథలోకి;

ద్రావిడ దేశంలో కంచి అనే పట్టణంలో శక్తిసారుడు అనే ఒక వ్యాపారి ఉండే వాడు. అతనికి 18 ఏళ్ల వయసు కానీ చాలా ధనవంతుడు. వంటరివాడు. అందుకని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరబడదాం అని అనుకున్నాడు. తనే ఒక యోగ్యమైన కన్యను వెతికి పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు. ఒక ప్రస్త(1 KG బరువు?) వడ్లు మూట గట్టుకుని దేశాటనికి బయలుదేరాడు. తనని ఒక జ్యోతిష్యుడని పరిచయం చేసుకునే వాడు.

మంచి కన్య కనిపిస్తే వారిని తన దగ్గెర ఉన్నవడ్లు వండి పెట్టమని అడిగేవాడు. కొంతమంది నవ్వి పోయేవారు.ఉత్త వడ్లతో భోజనం ఎలా పెడతాం అని. చాలా మంది సమాధానం కూడా చెప్పేవారు కాదు. అలా తిరుగుతూ కావేరి నది ఒడ్డున ఉన్న ఒక ఊరికి చేరుకున్నాడు.

ఆ ఊరిలో గోమిని అనే అమ్మాయి ఉన్నది. తల్లి తండ్రులు, ఆస్తీ, పోయినా ఆమె దాదీ ఆమెని పెంచి పెద్ద చేసింది. శక్తిసారుడు ఆమె ఇంటి అరుగుపై కుర్చుని సేద తిరుతున్నాడు. అప్పుడు దాదీ అతను జ్యోతిషుడు అని తెలిసి శక్తిసారుని వద్దకు గోమినిని తీసుకు వచ్చి, ఆమె చేయి చూసి భవిష్యత్తు చెప్పమన్నది. 

ఆమె చేయి చూసిన శక్తిసారుడు ఆమె చాలా అదృష్టవంతురాలు అని గ్రహించాడు. చూడటానికి కూడా చాలా పొందికగా ఉన్నది.ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. గోమినిని తన వద్ద ఉన్న వడ్లతో భోజనం చేసి పెట్టమని అడుగుతాడు.

ఆమె తన దాదీ వంక ఒక సారి చూసి, వడ్ల మూట అందుకుని, శక్తిసారుని కి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి, కాసేపు అరుగు మిద కుర్చోమన్నది. 

వడ్లను నేలపై చేత్తో రుద్ది, జాగ్రత్తగా లోపలి ధాన్యపు గింజలు విరగకుండా, పైన ఉన్న ఊకను వేరు చేసింది. ధాన్యాన్ని చెరిగి ఆ ఊకను దాదీకి ఇచ్చి, బంగారు నగలు తాయారు చేసుకునే వారు నగలను శుభ్రం చేసుకోవడానికి వాడుతారు కాబట్టి, వారికీ అమ్మి ఆ డబ్బుతో కట్టెలు, ఒక కుండ, రెండు మట్టి పాత్రలను తెచ్చి పెట్టమన్నది. 

దాదీ అన్నీ తెచ్చి ఇచ్చింది.పొయ్యి అలికి,కొన్ని కట్టెలు పెట్టి,రాజేసి, అగ్నిదేవునికీ, పొయ్యికీ, నమస్కరించి కుండలో ధాన్యం పోసి, తగినంత నీరు పోసి పొయ్యి పైన ఉంచింది. అన్నం ఉడకగానే, కట్టెలను అర్పివేసింది. కట్టెలు బొగ్గులుగా మారిపోయాయి. ఆ బొగ్గులను దాదీ కి ఇచ్చి కాయగూరలు, నెయ్యి ఇతర సామాగ్రి కొని తీసుకురమ్మని చెప్పింది. 

దాదీ అవన్నీ తీసుకుని రాగానే, మిగతా వంట చేసి, శక్తిసారుని స్నానం చేసి భోజనానికి రమ్మని చెప్పింది. చక్కటి కమ్మని విందు భోజనం పెట్టింది. త్రాగటానికి సుగంధభరితమైన చల్లని నీరు ఇచ్చింది.

శక్తిసారుడు చాలా ఆనంద పడి గోమినిని వివాహమాడి తన ఇంటికి తీసుకుని పోతాడు. తన గృహానికి ఆమెను యజమానురాలిని చేసి, సర్వాధికారాలు ఇస్తాడు. తన సహచర్యంలో శక్తిసారుడు ఆనందంగా జీవితం గడుపుతాడు. గృహిణి మీదే గృహం ఆధారపడి ఉంటుంది.

మరి పూర్వం కూడా మన వాళ్ళు ఎంత తెలివిగా ఇల్లు-వాకిలి చక్కదిద్దుకునే వారు. ఏ మేనేజ్మేంట్ పట్టాలు పుచ్చుకోలేదు. తల్లీ, ఇంట్లోని ఇతర పెద్దవాళ్ళ, పెళ్ళైన తరువాత అత్తగార్ల నుండి అన్ని నేర్చుకునేవారు. ఆడవాళ్ళు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఇల్లు చక్క దిద్దుకోలేకపోతే ఆ పరివారం లోని వారు సంతోషంగా ఉండలేరు. అలా అని భర్తలకు బాధ్యత లేదని కాదు. మనకి చాలా ఓర్పు, నేర్పు, సహనం ఉంటాయి. అది సృష్టి ధర్మం.

మరి నాకు గోమిని కధలో ఆమె చూపించిన తెలివి నచ్చింది. మీకూ ?

మీ...అనామిక....

No comments: