Friday 14 June 2013

తిలకము దిద్దరుగా ......1


అందమే ఆనందం...ఆనందమే జీవిత మకరందం...ఆ పాట మనకి సుపరిచితమే కదా ....అందం అదీ ఆడవారి అందాన్ని వర్ణించడం అంటే కవులకి ఒక సవాల్. ఎంత వర్ణించినా  ఇంకా ఎక్కడో ఏదో మిగిలే ఉంటుంది. ఆడవారి అందంలో ఒక భాగం వారి కట్టు-బొట్టు. 

ఆడవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం.అద్దం కనపడగానే అతుక్కు పోతారు అని, తయారు అవ్వాలంటే గంటలు గంటలు పడుతుందని ఇలా రక రకాలుగా మన పై అభియోగాలు వేస్తుంటారు. ఎంత మంది ఎన్ని అన్నా అందంగా అలంకరించుకోవటం మన హక్కు. ఏమంటారు? 

సరే అందం, అలంకరణ గురించి మాట్లాడాలంటే  మన భారత స్త్రీల సింగారమే సింగారం. దీనిని మించి ఇంకా ఏమైనా ఉంది అంటే నేను ఒప్పుకోను.

మన భారతీయ సంస్కృతీ అతి ప్రాచినమైనది. తరచి చుస్తే మన పద్ధతులు సంప్రదాయాలలో, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి, మనం పెట్టుకునే "బొట్టు" తీసుకోండి. మన ఆడవాళ్ళను  చూడగానే ఆకట్టుకునేది అదే. అసలు ఈ బొట్టు అనేది మన అతివలకు ఒక ప్రత్యేకత తెచ్చి పెట్టింది. ఇప్పుడు విదేశీ  వనితలు కూడా దీనిని ఇష్ట పడుతున్నారు. 

ఈ బొట్టులో ఎన్ని విషయాలు ఉన్నాయో. అంతే  కాదు ఇందులో చాలా సృజన కూడా దాగి ఉంది. ఎలా అంటారా..ఇదిగో ....

బొట్టు  అంటే...

హిందీలో బింది అని తిలక్ అని సువాసిని స్త్రీలు పెట్టుకునేది సిందూర్ అని  అంటారు. సంస్కృతం లో బిందు నుండి పుట్టినది బింది- అంటే చుక్క. బొట్టు, సింధూరం, తిలకం ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి. 
సింధూరం సింధు నాగరికతతో ముడిపడి ఉంది. సింధు నాగరికత అతి ప్రాచీనమైనది. పూర్వం ఈ బొట్టు లేదా తిలకాన్ని ఆడ-మగా అందరూ పెట్టుకునే వారు. 

నుదిటి పై బ్రహ్మ రాసిన రాతకి మనం గౌరవము ఇవ్వటం అని, ఆఙ్ఞా చక్రరం  అక్కడ ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టుకుంటే మానసిక శారీరిక ఆరోగ్యానికి మంచిదనీ మన పెద్దలు అంటారు

ఆడ పిల్లలు చిన్నతనం నుండి బొట్టు పెట్టుకున్నా/ తిలకం దిద్దుకున్నా  పెళ్లి అయిన తరువాత నుదిటి పైన, పాపిటలో పెట్టుకునే సింధూరానికి ఏంతో విలువని ఇస్తారు. ఇది వారికి వివాహమైనట్లు చెప్పకనే చెపుతుంది. ఉత్తరాదిన పెళ్లి అయిన ఆడవారి నుదుటి పై బొట్టు ఉన్నా లేకున్నా పాపిటలో సింధూరం తప్పక ఉండాలి. 

బొట్టు-ఆకారం : సాధారణంగా ఆడ వాళ్ళు బొట్టుని  గుడ్రంగా, పొడువుగా, కోలగా    పెట్టుకుంటారు. మగవారు, గుండ్రంగా కాని , పొడువుగా కాని, అడ్డ బొట్టు, నామాల బొట్టు అని పెట్టుకుంటారు 

బొట్టు -రంగు : ఎర్రటి ఎరుపు, మెరూన్, సింధూరం రంగు, తెలుపు, నలుపు  ఇలా రక రకాలు. తరువాతి కాలంలో ఎన్నో రంగుల కుంకుమలు దొరుకుతున్నాయి. 

బొట్టు-వాడే పదార్ధాలు  : బొట్టు పెట్టుకోవటానికి, కుంకుమ (పసుపు-సున్నం తో తయారు చేసినది), సింధూరం, గంధం, విభూతి ఇలా చాలా వాడే వారు. 

అంతేకాదండోయ్ అల పెట్టుకునే వాటిలో, కస్తూరి, కర్పూరం, సువాసనలు వెదజల్లే పూ రేకులు(మల్లె, గులాబి, మొగలి, మో.) గాని పుప్పొడి గాని, ఇతర పరిమళ ద్రవ్యాలను కాని చేర్చే వారని, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. వీట వల్ల మన ఆరోగ్యానికి ఏంతో ఉపయోగం. 

విభూతి గురించి మనకు తెలుసు కదా. శైవ మతస్తులు, సాయి భక్తులు  పెట్టుకుంటారు. యాగాలు చేసినప్పుడు యఙ్ఞ కుండంలోని భస్మం నుదుటిన విభూతి  లాగా పెట్టుకుంటే మనసు ఏంతో ప్రశాంతంగా ఉంటుంది కదండీ?

తరువాతి రోజులలో తిలకం, ఇప్పుడు స్టికర్ బిందీలు చాలా ప్రాచుర్యం పొందాయి

బొట్టు- పెట్టుకోవడం ఎలా: మధ్య వేలి తో పెట్టుకోవాలని అంటారు. అగ్గిపుల్లలు, చీపురు పుల్లలు పెట్టి తిలకం దిద్దుకోవటం మన చిన్నతనం లో చూశాం. ఇప్పుడు చక్కగా మేకప్ బ్రష్ తో పెట్టుకుంటున్నారు. 

నేను హరిద్వార్ వెళ్లిన్నప్పుడు రకరకాలైన ఆకారాలు కలిగిన మేకుల వంటివి గుత్తిగా చేసి, ఒక రింగుకి పెట్టి ఉన్నవి కొన్నాను. వాటిని నీటిలో ముంచి తరువాత కుంకుమ లో ముంచి పెట్టుకోవచ్చు . లేదా తిలకం లో ముంచి పెట్టుకోవచ్చు 

ఇంకా ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొవచ్చు. కాని. అవి తరువాతి టపాలలో చెప్పుకుందామా?

అంతే కాదండోయ్ ఈ శీర్షికలో నేను ఎక్కువగా బొట్లు -రకరకాలైన ఆకారాలను పోస్ట్ చేస్తాను..మరి మీరు సిద్ధమేనా? 

వచ్చే టపాలలో చూడండి ... తిలకము దిద్దరుగా .. కస్తూరి తిలకము దిద్దరుగా అంటూ ..... 



మీ...అనామిక....

No comments: