Wednesday 18 April 2012

రుచికరమైన అప్పడాలు-వడియాలు-1

ఎండా కాలం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి బోలెడు పని. అయిన మన దేశంలో అదీ మన రాష్ట్రంలో ఆడవాళ్ళకి పని లేనిది ఎప్పుడండి? ఏ కాలం  అయినా పచ్చడ్లని, పోడులని, ఉరగాయాలని ఏదో ఒక పని. 

అసలు ఇలా పచ్చడ్లు, మురబ్బాలు, జామ్లు, అప్పడాలు, వడియాలు, వరుగులు ఇవన్ని ఎందుకంటే, కొన్ని కొన్ని కాలాలో విరివిగా కాసే పళ్ళు కూరలు వంటివి, తక్కువ ధరలో కొని,  భద్ర పరచుకుని, తరువాత వాడుకోవచ్చు. 

ముఖ్యంగా ఎండలు బాగా కాస్తున్నప్పుడు, తరువాత శ్రావణ భాద్రపదాలలో కూరలు పళ్ళు సరిగ్గా దొరకవు. అదీ కాక మనకి ఇష్టమైనవి, ఆరోగ్యన్నిచ్చేవి రోజు కాక పోయిన అప్పుడప్పుడు తినలిగా. ఇంటికి వచ్చిన అతిథులకి సమయానికి కూరలు పచ్చళ్ళు నాలుగైదు చెయ్యలేక పోవచ్చు.  అలాగే పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి నాలుగైదు రకాలు తినటానికి ఉండాలికదా. పిల్లకి, పెద్దలకీ తోచన్నప్పుడు లేదా ఏ మధ్యనమో అలా నోట్లో వేసుకోవటానికి--మరి వీటన్నిటికి అప్పడాలు వడియాలు వంటివి బాగుంటాయి. 


మన రాష్ట్రం లో అసలు అప్పడాలు వడియాలు లేనిదే విందు భోజనం ఉండదు. 


ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఇవి దొరుకుతున్నాయి. కాని వాటిల్లో వాడే పదార్ధాలు ఎలా ఉంటాయో తెలిదు. అదీ కాక బోలెడు ఖర్చు. కొద్దిగా శ్రమ అనుకోకుండా మనమే వీలుచేసుకుని పెట్టు కుంటే నాణ్యమైనవి తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు. 


సరేనండి ఇప్పుడు మనం రుచికరమైన రక రకాల వడియాలు ఎలా పెట్టుకొవాలో తెలుసుకుందాం. వడియాలు ఒకొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. మన రాష్ట్రంలోనే కాక ఉత్తరాది వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే అన్ని చెప్పుకుందాం. 

1. గుమ్మడి కాయ వడియాలు :
మన  ఆంధ్ర  రాష్ట్రం  దీనికి  పెట్టింది  పేరు. అసలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ వడియాలు. 


కావలసినవి:
బూడిద గుమ్మడికాయ 1 పెద్దది 
మినప్పప్పు    అర కిలో
పచ్చి మిర్చి     పావు కిలో 
ఇంగువ      ఒక టీ స్పూన్ 
ఉప్పు తగినంత 


ముందు మాట : 
  1. గుమ్మడి కాయ బాగా ముదురు అయినది వాడాలి.
  2. దీనికి పొట్టు మినపప్పు వాడితే రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడాను.
  3. ఈ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. 
  4. కాయని బట్టి పప్పు ఎంత అన్నది చూసుకోవాలి. కొంత మందికి ముక్కలు ఎక్కువగా ఉంటె ఇష్టం. కొంత మందికి పిండి ఎక్కువగా ఉంటె ఇష్టం. ఎదైనా ముక్కలు మరీ ఎక్కవగా ఉంటే వడియాలు పెట్టటం కష్టం. ఆ ముక్కలను పట్టి ఉంచే అంత పిండి ఉండాలి. 
  5. మీరు పప్పు కొంచెం ఎక్కువ నాన్న బెట్టుకోండి. మిగిలిన పిండి ఏ గారెలో వేసుకోవచ్చు. తక్కువ అయితే కష్టం. 
  6. ఇంగువ మంచి సువాసన కలిగినది వాడితే బాగుంటుంది.
  7. పచ్చి మిరప కారమే బాగుంటుంది. లేదంటే పొడి కారం వాడండి.
  8. పచ్చి మిరప కాయలు మెత్తగా దంచి/రుబ్బి గాని లేదా ముక్కలుగా గాని వాడుకోవచ్చు. కాని మెత్తగా దంచినదైతేనే బాగుంటుంది. ముక్కలైతే కారం అంతటా కలవదు.
  9.  కారం, ఉప్పు  మీ రుచిని బట్టి వేసుకోండి. 
మొదటి విధానం: 
  • వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి తగినంత నిరు పోసి పప్పు నాన బెట్టండి.

  • గుమ్మడి కాయను ముక్కలుగా తరగాలి.
  • ముక్కలు మరీ పెద్దవి చిన్నవి కాకుండా ఉండాలి. 
  • గింజలు తీసివేయండి. పక్షులు కానీ ఉడతలు కాని ఈ గింజల కోసం వడియాలు పడుచేస్తాయని తిసేయమంటారు.
  • ముక్కలని ఒక పలుచని నూలు వస్త్రం(పాత తువాలు,పంచె, లాంటివి) లో  వేసి బాగా గట్టిగా మూట కట్టాలి.
  • ఈ మూటను చేటలో/చిల్లుల బుట్టలో పెట్టి పైన ఒక పళ్ళెం/పీట పెట్టి దానిపై పొత్రం లాంటి బరువు  పెట్టాలి. 
  • ఇది వరుకు వెదుర లేక తాటాకు బుట్టలు వాడే వాళ్ళు. మనం చిల్లుల స్టీల్ బుట్ట/జల్లెడ  వాడుకోవచ్చు.
  • ఈ ముక్కల నుండి వచ్చే రసం ఒక బేసిన్లో గాని పెద్ద లోతైన  పళ్ళెంలో గాని వోడేటట్టు  పెట్టుకోండి. అంటే ముక్కలు ఉన్న బుట్ట/జల్లెడ ఏట వాలుగా పెడితే ఇంకా మంచిది. 
  • మర్నాడు, ప్రొద్దున్నే పప్పు బాగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగాలి. పొట్టు పప్పు వాడితే పొట్టు పోయేంత వరకు కడగాలి.పొట్టును వేరుగా వడియాలు పెట్టవచ్చు. అందుకని పారేయకండి. 
  • పప్పును నీరంతా వోడిపొయేదాకా జల్లెడ/చిల్లుల బుట్టలో వేసి పెట్టు కోండి.
  • పప్పు ను బాగా మెత్తగా కాటుక లాగా రుబ్బాలి కాని చాలా చాలా గట్టిగా ఉండాలి. దీనికి గుమ్మడికాయ నీళ్ళను ఉపయోగించండి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు వాడండి.
  • పిండీ పలుచగా ఉంటే, వడియాలు పెట్టటానికి సరిగ్గా రావు.త్వరగా ఎండవు. బట్ట నుండి వలవటానికి కష్టం. పొడి పొడి అవుతాయి. 
  • మిక్సి కంటే వెట్ గ్రైండర్ లో రుబ్బిన పిండి చాల బాగుంటుంది. గట్టిగా రుబ్బడం  తేలిక. గుల్లగా వస్తాయి. 
  • పప్పు బాగా నలిగాక ఉప్పు, ఇంగువ  పచ్చి మిర్చి వేసి మరి కొంచెం  సేపు  రుబ్బండి. ఇలా చేస్తే అన్ని బాగా కలసిపోతాయి.
  • ఈ పిండిని ఒక పెద్ద గిన్నె లోకి తీసుకుని, ముక్కలు వేసి బాగా కలపండి. 
  • ఒక మందపాటి నూలు చీరె కాని, దుప్పటి కాని నీళ్ళల్లో తడిపి బాగా పిండుకోండి.
  • చెక్క బల్ల కానీ, మంచం మిద కాని లేదా నేలపైన కాని చాపను పరిచి దాని పైన ఈ గుడ్డని కొద్ది కొద్దిగా పరుచుకుంటూ, వడియాలు పెట్టాలి. అంతా ఒక సారే పరిస్తే బట్ట తడి ఆరిపోతుంది. అప్పుడు వడియాలు సరిగ్గా రావు.
  • ఒక గిన్నెతో నీళ్ళు దగ్గెర పెట్టుకుని, బట్ట పొడి అయితే కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి. 
  • అలాగే చెయ్యి తడి చేసుకుంటూ ఉండాలి. 
  • మధ్య మధ్యలో పిండి బాగా కలపకపోతే, ముక్కలు పైకి ఉండి, పిండి క్రిందికి జారిపోతూ ఉంటుంది. 
  • వడియాలు మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా పెట్టాలి. అలాగే ముక్కలూ, పిండీ రెండు సమంగా ఉంటె బాగుంటుంది. 
  • రెండు రోజులు బాగా ఎర్రటి ఎండలో ఎండా బెట్టాలి. తరువాత నెమ్మదిగా వడియాలను బట్టనుండి వేరు చేయాలి.
  • వలవటం కష్టంగా ఉంటే, బట్ట వెనుక వైపు కొద్దిగా నీళ్ళు చిలకరించి, కొన్ని నిముషాల తరువాత నెమ్మదిగా తీస్తే తేలికగా వస్తాయి.
  • ఇవి తిరగేసి ఒక రెండు రోజ్జులు ఎండ బెట్టాలి.
  • బాగా కరకర లాడే దాకా ఎండ బెట్టి, సాయంత్రం కొద్ది సేపు ఇంట్లో వేడి తగ్గే వరకు ఉంచి, ఒక మంచి సేలోఫెన్ సంచిలో వేసి గాలి చొర బడకుండా మూత పెట్టుకోండి. ఇలా చేస్తే, వర్షా కాలంలో చెమ్మకి వడియాలు పాడవకుండా ఉంటాయి.
  • అప్పుడప్పుడు ఎండ బాగా వచ్చిన రోజున ఒక్క సారి ఎండ బెడితే సంవత్సరం పాటు ఉంటాయి. 

రెండో విధానం: 

గుమ్మడి కాయను తురిమి కూడా పెట్టు కోవచ్చు. క్రింతం రోజు రాత్రే తురిమి, బట్టలో వేసి మూటలా కట్టి బాగా గట్టిగా పిండీ, ఆ నీటిని పప్పు రుబ్బడానికి వాడుకోవాలి. మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పినట్లే. 

వడియాలు, గుల్లగా రావాలంటే, పప్పు కాటుక లాగా, గట్టిగా, చాలా తక్కువ నీటితో రుబ్బుకోవాలి. ఎర్రని ఎండలో ఎండా బెట్టాలి. ఎండ సరిగ్గా లేక ఎక్కువ రోజులు ఎండితే, వడియాలు సరిగ్గా రావు.


మరి మీరు పెట్టి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో....


మీ...అనామిక....

No comments: