Monday 30 April 2012

కాడ కుట్టు-Stem Stitch-6

 Whipped Stem Stitch

ముందుగా కాడ కుట్టు కుట్టుకోవాలి.
వేరే రంగు -లేత, ముదురు, కాంట్రాస్ట్ రంగుది- దారంతో, పైన చూపిన విధంగా ప్రతి కుట్టు పైనుండి, అడుగు నుండి తీయాలి. బట్టలోకి మాత్రం దుర్చకూడదు-కేవలం మొదలు చివర తప్ప. 
ఆ కుట్టు ఇలా కనిపిస్తుంది. 

మరి వచ్చే టపాలలో మరిన్ని కుట్లు...

మీ...అనామిక....

Saturday 28 April 2012

కాడ కుట్టు -Stem Stitch-5

Long  Stem Stitch

కాడ కుట్టు కుటుంబానికి చెందిన మరొక కుట్టు నేర్చుకుందామా?
మామూలు కాడ కుట్టు లాగానే కుట్టాలి కాని కాడ కుట్టులో అంతకుముందు కుట్టిన కుట్టు దగ్గెర నుండి కుడతాం కదా. అంటే A నుండి B కి కుట్టి A-B కి మధ్యలో C నుండి D కి. తరువాత B నుండి E కి ఇలా అన్నమాట. దారం క్రింది వైపునకి ఉండాలి. పై వైపునకి ఉంటే అవుట్ లైన్ కుట్టు.

ఈ కుట్టులో ఇలా B నుండి కాకుండా కొంత దూరం వదిలి కుట్టాలి. ఎంత వదిలి కుట్టాలన్నది, మనము ఉపయోగించే దారం యొక్క మందము/పోచల పై ఆధారపడి ఉంటుంది.
ఈ కుట్టు ఇలా కనిపిస్తుంది. 

ఇది పెద్దపెద్ద లతలు కుట్టటానికి ఉపయోగ పడుతుంది. ఏదైనా ఒక ఆకారం -పువ్వు, ఆకు  లాంటివి, ఎక్కువ భాగం ఫిల్లింగు చేయాలంటే ఈ కుట్టు ఉపయోగపడుతుంది. త్వరగా కుట్ట వచ్చు. 

ఫ్రాన్సు లో ఈ కుట్టుని ఎక్కువగా ఫిల్లింగ్ కి ఉపయోగిస్తారు. ఒక లైను తరువాత ఒకటి బాగా దగ్గెరగా బట్ట కనిపించకుండా కుండా కుడతారు. ముద్ద కుట్టుకంటే చాల సులభంగా తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో కుట్టవచ్చు. అచ్చు ముద్ద కుట్టు లాగానే ఉంటుంది. 

ఒక పువ్వు కాని ఒక ఆకు కాని, లేదా జంతువుల బొమ్మలు -ఇలా ఏదైనా కుట్టేటప్పుడు, ఒకే రంగు లో వివిధ షేడ్స్ వాడితే ముద్ద కుట్టులో లాగా అందంగా ఉంటుంది. ఇది మనం తరువాత చెప్పు కుందాం. 

మరి నా ఈ టపాలు మీకు నచ్చుతున్నయనీ, సులభంగా అర్ధం అవుతున్నాయని అనుకుంటున్నాను.

మీ...అనామిక....

Sunday 22 April 2012

అమ్మమ్మ చిట్కాలు-4

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, శనగ, బియ్యం, గోధుమ వంటి పిండ్లు పురుగులు పడతాయి. మైదా ఐతే మరి కష్టం. కొద్దిగా పురుగు పడ్తే, బాగా జల్లించి ఎండలో పెట్టి మళ్ళి వాడుకోవచ్చును. కాని ఎక్కువగా ఉంటె ముక్క వాసన వేస్తాయి. అటువంటి పిండ్లని తినటానికి వాడలేము. వండిన తరువాత కూడా ముక్క వాసన ఉంటుంది. అందుకని పార వేస్తాము. డబ్బు దండగ  అని భాద పడతాము.

అలాంటి పిండ్లను జల్లించి ఎండ పెట్టి ఒక డబ్బాలో పెట్టి ఉంచుకోండి. దీనిని క్రింది విధంగా ఉపయోగించండి.
  1. వంటింట్లో కాని, దేవుని మదిరంలో కాని అప్పుడప్పుడు  చేయి జారి నూనె వలుకుతుంది. ఎక్కువగా వోలికితే, ముందు బ్లాటర్ పేపరు కానీ మాములు న్యూస్ పేపర్ కానీ వేసి, లేదా బట్ట తోనో అక్కడే  అద్ది నూనె తీసివేయండి. అటు ఇటు తుడవద్దు. నేలంతా అవుతుంది. ఇలా తీసి వేసినా ఇంకా నూనె జిడ్డు ఉంటుంది. ఇప్పుడు ఆ మారక పై ఈ పిండిని జల్లండి. మరకంతా పరుచుకునేలాగా బాగా వత్తుగా జల్లి కొంచెం సేపు ఆగి, పిండిని తీసివేసి, నేలను తుడుస్తే జిడ్డు పోతుంది. 
  2. తక్కువగా వోలికితే, వెంటనే అక్కడ వత్తుగా పిండి చల్లేయండి. తరువాత పిండిని తీసివేసి, అక్కడ తుడిచేయండి. జిడ్డు త్వరగా వదులుతుంది. 
  3. జిడ్డు పట్టిన సామాన్లు-బాండి, మూకుడు, నూనె క్యారియర్లు, నేతి క్యారియర్లు, పచ్చళ్ళ జాడీలు/సీసాలు, గరిటెలు, దీపపు కుందులు, దోశెల  పెనం ఇలా ఏవైనా జిడ్డు ఉన్నవి కడగాలంటే, చాల కష్టం.   అందుకని ముందు ఈ పిండి తో బాగా తుడిచి, తరువాత సబ్బూ, వేడి నీటి తో కడగండి. చాల సులభంగా జిడ్డు వదులుతుంది. జిడ్డు వదిలిన దాకా రెండు మూడు సార్లు  ఎక్కువ పిండితో రుద్దండి.  మనకి శ్రమ తక్కువ, చేతులు పాడవవు. అసలు వేడి నీటి అవసరం అంతగా ఉండదు.
  4. నేనైతే వారాని కో రెండు వారాలకో, గుప్పెడు పిండి తీసుకుని, పచ్చళ్ళ జాడీలు, నూనె, నేతి  క్యారియర్లు,  నూనె-నేతి గిన్నెలు బయట  వైపున రుద్ది తరువాత ఒక పొడి బట్టతో తుడిచి వేస్తాను. ఇలా చేయటం వలన వాటిని మాటి మాటికి కడగనవసరం లేదు. నూనె-నేతి  క్యారియలనుండి జిడ్డు కారి అవి పెట్టిన చోటంతా జిడ్డు అవుతుంది. అల అవకుండా మనం కాపాడుకోవచ్చు. 
  5. నూనె, నేతి  క్యారియర్లు  గిన్నెలు పెట్టే చోటు కూడా ఈ పిండితో తుడిచి చూడండి జిడ్డు మాయం. 
  6. వంట గట్టు, పొయ్యి, టేబుల్ ఇలా జిడ్డు ఉన్న ప్రదేశం ఏదైనా సరే ఈ చిట్కా బాగా పని చేస్తుంది. 
  7. భూత దయ అని అనుకునే వారు, ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు కలిపి ఉండలుగా చేసి, చీమలు, కీటకాలు ఉన్నదగ్గెర రోజు పెడితే మంచిది. 
గమనిక: పిండీ, తుడిచే వస్తువులు/ప్రదేశం  పొడిగానే ఉంచండి. ముందుగా నీళ్ళు పోస్తే జిడ్డు వదలదు. 

మరి పురుగు పట్టిందని పిండిని పారేసే బదులు ఇలా ఉపయోగించుకోవచ్చు. ఖరీదులు పెట్టి, కెమికల్ ఉన్న సబ్బులు కొని, వాడితే చేతులు దెబ్బతింటాయి. దాని బదులు ఈ చిట్కా శ్రమ తక్కువ, సులభం కూడాను కదా.


మీ...అనామిక....

కాడ కుట్టు -Stem Stitch-4

Alternating Stem Stitch.

కాడ కుట్టు లోనే ఇంకొక కుట్టు చూద్దామా?
కాడ కుట్టు లో దారం క్రింది వైపుకి ఉంచి కుడతాం కదా. మొదట చెప్పుకున్నది ఇక్కడ ఒక సారి చూడండి.    

అలాగే అవుట్ లైన్ కుట్టు లో దారం పై వైపుకి ఉంచ్చి కుడతాం.  ఈ  పాఠం ఒక సరి చూడండి.

ఈ కుట్టు లో దారాన్ని ఒకసారి పైకి ఒకసారి క్రిందికి పెట్టి కుట్టాలి. అందుకే దీనిని Alternating Stem Stitch అంటారు.


ఇలా ఇదే కుట్టుని వెరైటీ గా కుట్టుకోవచ్చు. బోర్డర్ లాగా, పిల్లల గావున్ల కీ, బ్లోవుజ్ లకీ, చీరెలు చున్నీల కీ, గాలేబుల కీ ఇలా వేటికైనా వాడుకోవచ్చు. వేరే ఇతర కుట్లతో నూ కలిపి కుట్టుకోవచ్చు. 

మరి మీరు కుట్టి చూడండి. వీటిలో వెరైటీలు తరువాత చెప్పుకుందాం. 


మీ...అనామిక....

Thursday 19 April 2012

కాడ కుట్టు -Stem Stitch-3

Outline Stitch

ఇది కుడా కాడ కుట్టులో ఒక రకం. 
కాడ కుట్టు లాగానే కుట్టాలి. కాడ కుట్టులో దారం క్రింది వైపుకి ఉంచి కుడితే, ఈ కుట్టు లో దారం పై వైపుకి ఉంచి కుట్టాలి. మిగతా అంతా కాడ కుట్టు లానే.

మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కాడ కుట్లు. 

ఈ కుట్టు అవుట్ లైన్ కీ, కాడలు, లతలు కొమ్మలు కుట్టటానికి బాగా పనికొస్తుంది.

మరి మీరు ఈ కుట్లని బాగా సాధన చేయండి....ఇంకా చాలా చెప్పుకోవలసి నవి ఉన్నాయి.


మీ...అనామిక....

Wednesday 18 April 2012

రుచికరమైన అప్పడాలు-వడియాలు-1

ఎండా కాలం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి బోలెడు పని. అయిన మన దేశంలో అదీ మన రాష్ట్రంలో ఆడవాళ్ళకి పని లేనిది ఎప్పుడండి? ఏ కాలం  అయినా పచ్చడ్లని, పోడులని, ఉరగాయాలని ఏదో ఒక పని. 

అసలు ఇలా పచ్చడ్లు, మురబ్బాలు, జామ్లు, అప్పడాలు, వడియాలు, వరుగులు ఇవన్ని ఎందుకంటే, కొన్ని కొన్ని కాలాలో విరివిగా కాసే పళ్ళు కూరలు వంటివి, తక్కువ ధరలో కొని,  భద్ర పరచుకుని, తరువాత వాడుకోవచ్చు. 

ముఖ్యంగా ఎండలు బాగా కాస్తున్నప్పుడు, తరువాత శ్రావణ భాద్రపదాలలో కూరలు పళ్ళు సరిగ్గా దొరకవు. అదీ కాక మనకి ఇష్టమైనవి, ఆరోగ్యన్నిచ్చేవి రోజు కాక పోయిన అప్పుడప్పుడు తినలిగా. ఇంటికి వచ్చిన అతిథులకి సమయానికి కూరలు పచ్చళ్ళు నాలుగైదు చెయ్యలేక పోవచ్చు.  అలాగే పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి నాలుగైదు రకాలు తినటానికి ఉండాలికదా. పిల్లకి, పెద్దలకీ తోచన్నప్పుడు లేదా ఏ మధ్యనమో అలా నోట్లో వేసుకోవటానికి--మరి వీటన్నిటికి అప్పడాలు వడియాలు వంటివి బాగుంటాయి. 


మన రాష్ట్రం లో అసలు అప్పడాలు వడియాలు లేనిదే విందు భోజనం ఉండదు. 


ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఇవి దొరుకుతున్నాయి. కాని వాటిల్లో వాడే పదార్ధాలు ఎలా ఉంటాయో తెలిదు. అదీ కాక బోలెడు ఖర్చు. కొద్దిగా శ్రమ అనుకోకుండా మనమే వీలుచేసుకుని పెట్టు కుంటే నాణ్యమైనవి తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు. 


సరేనండి ఇప్పుడు మనం రుచికరమైన రక రకాల వడియాలు ఎలా పెట్టుకొవాలో తెలుసుకుందాం. వడియాలు ఒకొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. మన రాష్ట్రంలోనే కాక ఉత్తరాది వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే అన్ని చెప్పుకుందాం. 

1. గుమ్మడి కాయ వడియాలు :
మన  ఆంధ్ర  రాష్ట్రం  దీనికి  పెట్టింది  పేరు. అసలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ వడియాలు. 


కావలసినవి:
బూడిద గుమ్మడికాయ 1 పెద్దది 
మినప్పప్పు    అర కిలో
పచ్చి మిర్చి     పావు కిలో 
ఇంగువ      ఒక టీ స్పూన్ 
ఉప్పు తగినంత 


ముందు మాట : 
  1. గుమ్మడి కాయ బాగా ముదురు అయినది వాడాలి.
  2. దీనికి పొట్టు మినపప్పు వాడితే రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడాను.
  3. ఈ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. 
  4. కాయని బట్టి పప్పు ఎంత అన్నది చూసుకోవాలి. కొంత మందికి ముక్కలు ఎక్కువగా ఉంటె ఇష్టం. కొంత మందికి పిండి ఎక్కువగా ఉంటె ఇష్టం. ఎదైనా ముక్కలు మరీ ఎక్కవగా ఉంటే వడియాలు పెట్టటం కష్టం. ఆ ముక్కలను పట్టి ఉంచే అంత పిండి ఉండాలి. 
  5. మీరు పప్పు కొంచెం ఎక్కువ నాన్న బెట్టుకోండి. మిగిలిన పిండి ఏ గారెలో వేసుకోవచ్చు. తక్కువ అయితే కష్టం. 
  6. ఇంగువ మంచి సువాసన కలిగినది వాడితే బాగుంటుంది.
  7. పచ్చి మిరప కారమే బాగుంటుంది. లేదంటే పొడి కారం వాడండి.
  8. పచ్చి మిరప కాయలు మెత్తగా దంచి/రుబ్బి గాని లేదా ముక్కలుగా గాని వాడుకోవచ్చు. కాని మెత్తగా దంచినదైతేనే బాగుంటుంది. ముక్కలైతే కారం అంతటా కలవదు.
  9.  కారం, ఉప్పు  మీ రుచిని బట్టి వేసుకోండి. 
మొదటి విధానం: 
  • వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి తగినంత నిరు పోసి పప్పు నాన బెట్టండి.

  • గుమ్మడి కాయను ముక్కలుగా తరగాలి.
  • ముక్కలు మరీ పెద్దవి చిన్నవి కాకుండా ఉండాలి. 
  • గింజలు తీసివేయండి. పక్షులు కానీ ఉడతలు కాని ఈ గింజల కోసం వడియాలు పడుచేస్తాయని తిసేయమంటారు.
  • ముక్కలని ఒక పలుచని నూలు వస్త్రం(పాత తువాలు,పంచె, లాంటివి) లో  వేసి బాగా గట్టిగా మూట కట్టాలి.
  • ఈ మూటను చేటలో/చిల్లుల బుట్టలో పెట్టి పైన ఒక పళ్ళెం/పీట పెట్టి దానిపై పొత్రం లాంటి బరువు  పెట్టాలి. 
  • ఇది వరుకు వెదుర లేక తాటాకు బుట్టలు వాడే వాళ్ళు. మనం చిల్లుల స్టీల్ బుట్ట/జల్లెడ  వాడుకోవచ్చు.
  • ఈ ముక్కల నుండి వచ్చే రసం ఒక బేసిన్లో గాని పెద్ద లోతైన  పళ్ళెంలో గాని వోడేటట్టు  పెట్టుకోండి. అంటే ముక్కలు ఉన్న బుట్ట/జల్లెడ ఏట వాలుగా పెడితే ఇంకా మంచిది. 
  • మర్నాడు, ప్రొద్దున్నే పప్పు బాగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగాలి. పొట్టు పప్పు వాడితే పొట్టు పోయేంత వరకు కడగాలి.పొట్టును వేరుగా వడియాలు పెట్టవచ్చు. అందుకని పారేయకండి. 
  • పప్పును నీరంతా వోడిపొయేదాకా జల్లెడ/చిల్లుల బుట్టలో వేసి పెట్టు కోండి.
  • పప్పు ను బాగా మెత్తగా కాటుక లాగా రుబ్బాలి కాని చాలా చాలా గట్టిగా ఉండాలి. దీనికి గుమ్మడికాయ నీళ్ళను ఉపయోగించండి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు వాడండి.
  • పిండీ పలుచగా ఉంటే, వడియాలు పెట్టటానికి సరిగ్గా రావు.త్వరగా ఎండవు. బట్ట నుండి వలవటానికి కష్టం. పొడి పొడి అవుతాయి. 
  • మిక్సి కంటే వెట్ గ్రైండర్ లో రుబ్బిన పిండి చాల బాగుంటుంది. గట్టిగా రుబ్బడం  తేలిక. గుల్లగా వస్తాయి. 
  • పప్పు బాగా నలిగాక ఉప్పు, ఇంగువ  పచ్చి మిర్చి వేసి మరి కొంచెం  సేపు  రుబ్బండి. ఇలా చేస్తే అన్ని బాగా కలసిపోతాయి.
  • ఈ పిండిని ఒక పెద్ద గిన్నె లోకి తీసుకుని, ముక్కలు వేసి బాగా కలపండి. 
  • ఒక మందపాటి నూలు చీరె కాని, దుప్పటి కాని నీళ్ళల్లో తడిపి బాగా పిండుకోండి.
  • చెక్క బల్ల కానీ, మంచం మిద కాని లేదా నేలపైన కాని చాపను పరిచి దాని పైన ఈ గుడ్డని కొద్ది కొద్దిగా పరుచుకుంటూ, వడియాలు పెట్టాలి. అంతా ఒక సారే పరిస్తే బట్ట తడి ఆరిపోతుంది. అప్పుడు వడియాలు సరిగ్గా రావు.
  • ఒక గిన్నెతో నీళ్ళు దగ్గెర పెట్టుకుని, బట్ట పొడి అయితే కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి. 
  • అలాగే చెయ్యి తడి చేసుకుంటూ ఉండాలి. 
  • మధ్య మధ్యలో పిండి బాగా కలపకపోతే, ముక్కలు పైకి ఉండి, పిండి క్రిందికి జారిపోతూ ఉంటుంది. 
  • వడియాలు మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా పెట్టాలి. అలాగే ముక్కలూ, పిండీ రెండు సమంగా ఉంటె బాగుంటుంది. 
  • రెండు రోజులు బాగా ఎర్రటి ఎండలో ఎండా బెట్టాలి. తరువాత నెమ్మదిగా వడియాలను బట్టనుండి వేరు చేయాలి.
  • వలవటం కష్టంగా ఉంటే, బట్ట వెనుక వైపు కొద్దిగా నీళ్ళు చిలకరించి, కొన్ని నిముషాల తరువాత నెమ్మదిగా తీస్తే తేలికగా వస్తాయి.
  • ఇవి తిరగేసి ఒక రెండు రోజ్జులు ఎండ బెట్టాలి.
  • బాగా కరకర లాడే దాకా ఎండ బెట్టి, సాయంత్రం కొద్ది సేపు ఇంట్లో వేడి తగ్గే వరకు ఉంచి, ఒక మంచి సేలోఫెన్ సంచిలో వేసి గాలి చొర బడకుండా మూత పెట్టుకోండి. ఇలా చేస్తే, వర్షా కాలంలో చెమ్మకి వడియాలు పాడవకుండా ఉంటాయి.
  • అప్పుడప్పుడు ఎండ బాగా వచ్చిన రోజున ఒక్క సారి ఎండ బెడితే సంవత్సరం పాటు ఉంటాయి. 

రెండో విధానం: 

గుమ్మడి కాయను తురిమి కూడా పెట్టు కోవచ్చు. క్రింతం రోజు రాత్రే తురిమి, బట్టలో వేసి మూటలా కట్టి బాగా గట్టిగా పిండీ, ఆ నీటిని పప్పు రుబ్బడానికి వాడుకోవాలి. మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పినట్లే. 

వడియాలు, గుల్లగా రావాలంటే, పప్పు కాటుక లాగా, గట్టిగా, చాలా తక్కువ నీటితో రుబ్బుకోవాలి. ఎర్రని ఎండలో ఎండా బెట్టాలి. ఎండ సరిగ్గా లేక ఎక్కువ రోజులు ఎండితే, వడియాలు సరిగ్గా రావు.


మరి మీరు పెట్టి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో....


మీ...అనామిక....

Tuesday 17 April 2012

రంగవల్లి-54

15 X 8 చుక్కలు -మధ్య చుక్క.




మీ...అనామిక....

కాడ కుట్టు- Stem Stitch-2

ఇది కాడ కుట్టులోనే ఇంకొక రకం. ఇది కాడలు లతలు, కొమ్మలు వెడల్పుగా కావాలనుకున్నప్పుడు కుట్టు కోవచ్చును.
ఇది కాడ కుట్టులాగానే కుట్టాలి కాని కుట్టు కొంచెం ఏటవాలుగా అంటే క్రాస్ గా. ఇలా మనకి కావలసినంత వెడల్పు కుట్టవచ్చు. కాని మరి ఎక్కువైతే బాగుండదు. 
మాములు కాడ కుట్టు సన్నగా ఉంటే ఇది వెడల్పుగా ఉంటుంది. తేడాను గమనించండి. 

ఈ కుట్టుని మాములు బట్ట పై సులభంగా కుట్ట వచ్చు. మ్యాటి మీద అయితే, కుట్టే పధతి మీకు సులభంగా అర్ధమవుతుందని కుట్టాను అంతే.


మీ...అనామిక....

Monday 16 April 2012

రంగవల్లి -53

15 చుక్కలు 5 వరుసలు 5  వరకు సరి/ఎదురు చుక్క.




మీ...అనామిక....

Sunday 15 April 2012

రంగవల్లి -52

రామ బాణాల ముగ్గు

ఇది నేను శ్రీ రామ నవమికి వేసినది. ఒక మాట ఒక బాణం ఒక పత్ని అని రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని కొనియాడుతాం.రాముణ్ణి తలుచుకుంటే భూత ప్రేత పిశాచాలు దగ్గెరకు రావని అంటారు. 

ఏదైనా మన రాష్టంలో రాముణ్ణి ఎక్కువగా కొలుస్తాము. 


 7X7 చుక్కలు . 
11X11 చుక్కలు తరువాత 3, 1  చుక్కలు అన్ని వైపులా.


మీ...అనామిక....

కాడ కుట్టు-Stem Stitch-1

కాడ  కుట్టు అంటే Stem Stitch, Outline Stitch, Stalk Stitch, South Kensington Stitch, Crewel Stitch అని కూడా అంటారు. 

ఇది ఏ డిజైన్ అయిన అవుట్ లైన్ చేయటానికి ఎక్కువగా వాడతారు. అంటే ముద్దా కుట్టు లేదా గొలుసు కుట్టు లేదా ఇంకేదైనా కుట్టుని ఫిల్లింగ్  కోసం వాడినప్పుడు  చుట్టురా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది.


లేదా కేవలం అలా అవుట్ లైన్ లాగా కుట్టి వదిలేయచ్చును. ఇలా రెడ్ వర్క్ లో వాడతారు.


దిని పేరుకు తగ్గట్లుగానే కాడలు, కొమ్మలు, లతలు కుట్టటానికి ఉపయోగిస్తారు. వేరే  కుట్ల తో కలిపికుట్ట వచ్చును. బహుశ ఇది అన్నింటి కంటే ఎక్కువగా వాడే కుట్టు అని చెప్పుకోవచ్చు.

ఇది కుట్టటం చాల తేలిక. తొందరగా కుట్ట వచ్చును. ఈ ఫోటోలలో చూడండి.

 A దగ్గెర  క్రింది నుండి బట్ట పైకి దారం తీయండి.
B దగ్గెర బట్ట క్రిందికి దించి, A - B కి మధ్యన C దగ్గెర  నుండి  మళ్ళి దారం మళ్ళి పైకి తీయండి. మళ్ళి C నుండి  కొంత దూరం D దగ్గెర దారం బట్ట క్రిందికి దించండి. ఇప్పుడు మళ్ళి C - D కి మధ్యన  అంటే  B నుండి లేదా  కొంచెం వదిలి వేరే స్థానం నుండి పైకి రావాలి. ఇలా మనకి కావలిసనంత కుట్టు కోవాలి.  
ప్రతి సారి దారం క్రింది వైపునకు మాత్రమె ఉండాలి. 
ఇలా కనిపిస్తుంది పూర్తీ అయిన తరువాత. 

మీకు అర్ధం అయ్యిందనుకుంటాను. 

మీ...అనామిక....

Saturday 14 April 2012

ఎంబ్రాయిడరి కుట్లు -కావలసినవి-3

ఈ  శీర్షికలో ఇంతకు ముందు చెప్పుకున్నవి:



3. దారాలు -I

ఎంబ్రాయిడరికి కావలసిన వాటిల్లో దారాలూ ముఖ్యమైనవే. మనం కుట్టే బట్ట/వస్త్రం యొక్క మందం, రంగు, మనం ఎంచుకున్న డిజైను, కుట్టే కుట్టు వీటన్నిటిని దృష్టి లో పెట్టుకుని సరి పోయే దారాలను ఎంచుకోవాలి. 

దారాలలో చాలా రకాలు ఉన్నాయి. మెషిన్ లో మాములుగా వాడేవి, ఎంబ్రాయిడరి కి వాడేవి, అలాగే, క్రోషియా, టాటింగ్ కి ఇలా అనేకం.

ప్రస్తుతానికి ఎంబ్రాయిడరికి వాడే వాటి గురించి చెప్పుకుందాం. తరువాత విడిగా  మిగిలిన వాటి గురించి చెప్పుకోవచ్చు.

1. విచ్చెల దారాలు:
మనం మాములుగా ఎంబ్రాయిడరికి వాడేవి ఏంకర్ వారి కాటన్ దారాలు. ఇవి ఇంద్రధనసు రంగులలో దొరకుతాయి. వీటికి 6 పోచలు ఉంటాయి. 8 మీ. పొడువు ఉంటాయి. వీటినే మనం విచ్చెలు అంటాము. 
 Anchor- Stranded Cotton - Single colours  
ఇందులో సింగిల్ రంగు అంటే దారమంతా ఒకే రంగు కలిగినవి. ఇవి వివిధ రంగులలో దొరుకుతాయి. 220 కి పైగా రంగులు ఉన్నాయి. 
  Anchor- Stranded Cotton-Shaded or Variegated
రెండు(షేడెడ్) లేక అంత కంటే ఎక్కువ రంగులు (మల్టీ కలర్డ్) ఒకే దారం లో ఉన్నవి కూడా దొరుకుతాయి. 
ఇవి మెటాలిక్ రంగులు. ఇందులో వెండి, బంగారం, రాగి, ఇత్తడి కాక పైన ఫోటోలో లాగ మెరిసే రంగులలో దొరుకుతాయి. అయితే కొన్ని రంగులు మాత్రమే ఉంటాయి. 

మన అవసరాన్ని బట్టి ఎన్ని పోచలు వాడాలన్నది నిర్ణయించుకోవాలి. ఇది కుట్టే వస్త్రం యొక్క మందం పై కూడా ఆధార పడి ఉంటుంది. 

2 . పెర్ల్ కాటన్  (Pearl Cotton): ఇవి  ఏంకర్ వారివే. కాటన్ దారాలు కొంచెం మందంగా మెరుస్తూ ఉంటాయి. ఈ దారం బంతులు 75 కు పైగా     రంగులలో దొరుకుతాయి. సింగల్, డబుల్ మరియూ మల్టీ షేడెడ్లలో లభ్యం. ఖరీదు ఎక్కువ. వీటిని ఎంబ్రాయిడరికే కాక లేసుల తయారికి కూడా వాడతారు. 
మరి కొన్ని తరువాతి టపాలలో చెప్పుకుందామా మరి...

మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు-3


ఎప్పుడైనా పొరపాటున చెయ్యి జారి  కోడి గుడ్డు పగిలి నెల పైన కానీ లేదా బల్ల మిద కాని వంట గట్టు మీద కానీ అందులోని దంతా పరుచుకున్నప్పుడు  చాల చికాకు వేస్తుంది. మాములుగా ఏ గుడ్డతోనో తీయాలంటే కష్టం. చేయంతా, ఇల్లంతా అవుతుంది. వాసన వేస్తుంది. నీళ్ళు పెట్టి  కడగాలి. ఇదంతా చాల శ్రమతో కూడుకున్నది. 

కాని ఒక చిన్న చిట్కాతో చాలా సులభంగా శుబ్రం చెయ్య వచ్చు.

ఒక గుప్పెడు ఉప్పు (టేబుల్ సాల్ట్ ) లేదా సరిపోయేంత ఆ వొలికిన దాని పైన పూర్తిగా చల్లండి. కొద్ది నిముషాల తరువాత అది గట్టి పడుతుంది. అప్పుడు టిష్యు పేపర్తో కాని, గుడ్డతో కాని ఎత్తి వేయండి. చాల సులభంగా వస్తుంది. తరువాత ఆ భాగాన్ని తడి గుడ్డ  పై కొన్ని చుక్కలు వినెగర్ (vinegar) వేసి తుడిచి వేయండి. 

ఎలాంటి ఇబ్బంది శ్రమ లేదు మరి.


మీ...అనామిక....

Wednesday 11 April 2012

అమమ్మ చిట్కాలు-2

వంటింటి ఆయుధాలు


ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా మన ధ్యాస ఇల్లు, ఇంట్లో సామాను, పిల్లలు వాళ్ళకి కావలసినవి వీటి మీదనే. మనం ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఇల్లు చక్క దిద్దుకోవటం మానం. నాకు ఇదే మన భారతీయా సంప్రదాయం లో నచ్చేది. ఇల్లు, పిల్లలు, ఇంట్లోని వారు ఆనందంగా ఉంటే గృహమేగా స్వర్గ సీమ అని పిస్తుంది. 

మరి గృహాన్ని స్వర్గ సీమ చేసు కోవాలి అనుకుంటే, కొన్ని చిట్కాలు పాటించాలి, కొన్ని వస్తువులు, వసతులు సమకూర్చు కోవాలి. ఎక్కువ ఖర్చు కాదు, మన సమయం ఆదా, శ్రమ కూడా తగ్గించు కోవచ్చు. 

ఇది చూడండి. చిన్న scraper-peeler. ఎందుకు లేండి ఇది ఖర్చు దండగ. మన ఇళ్ళలోఇలాంటివి పెద్దవి ఉంటే అనుకుంటున్నారా?

అల్లం వెల్లుల్లి గబుక్కున కోరాలంటే, ఇది చక్కగా ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో సరా సరి వంట చేసే పాత్ర లోకి కోరు కోవచ్చు. అలాగే కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు ఇలా ఎవైన కొద్దిగా కోరుకోవాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతికి అందేటట్టు పొయ్యికి దగ్గెరగా తగిలించి పెట్టు కుంటే చాల పనికొస్తుంది.

టీ చేసున్నప్ప్పుడు కొద్దిగా అల్లం మరిగే నీళ్ళలోకి చెక్కు తీసి  కోరుకోవచ్చు. 

అలాగే పీలరు కూడా  చక్కగా పనికొస్తుంది. బరువు తక్కువ,  కడుక్కోవటం తేలికే.


పెద్ద ఖరీదు లేదు. మరి మీరు వాడి చూడండి. 


మీ...అనామిక....