Thursday, 29 March 2012

పచ్చళ్ళు-2

పెరుగు పచ్చళ్ళు-1


మార్చి నెల, ఆఖరి వారం. అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. మరి ఏప్రెల్, మే నెలలు తలుచుకుంటే భయమేస్తోంది. ఎండా కాలం కూరలు దొరకవు. దొరికినా చాల ఖరీదు. పోనీ డబ్బు పోసి కొన్నా ఎ వేపుడో చేసినా తినాలని అనిపించదు. అయినా నూనెలు, మషాలాలు వేసవిలో ఎక్కువగా  తినకూడదు. 

అందుకని రోజువారీ పచ్చళ్ళు చేసుకుని అన్నంతోనో, రొట్టెల తోనో తింటే, ఆరోగ్యం, నోటికి రుచి, ఖర్చూ తక్కువే. 

ముందుగా పెరుగు పచ్చళ్ళతో మొదలు పెడదాం. వేసవిలో పెరుగు, మజ్జిగ ఆరోగ్యానికి మంచివి. నోటికి హితవు అనిపిస్తాయి. మన భోజనాలలో పెరుగు లేదా మజ్జిగాన్నం ఆఖరున తినటం అలవాటు. పెరుగులో ఉప్పుకాని చక్కెర వేసుకుని అన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. దీంతో పాటు నీరుల్లిపాయ ముక్కలు కాని, నిమ్మ, ఉసిరి, చింతకాయ పచ్చళ్ళు లేదా మంచి మామిడి పళ్ళు కాని తింటే ఇంక వేరే చెప్పాలా.

అయితే ఎప్పుడు ఉత్తి పెరుగే కాక పెరుగు పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. తినటానికి విసుగు అనిపించదు. మరి ఇంకేదుకు ఆలస్యం?

ముందుగా ఒక మాట:
 1. పచ్చడికి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. మరీ పులుపు ఉంటే చాలా ఉప్పు కారం వెయ్యాలి. రుచిగా ఉండదు. అసలు పులుపు ఇష్టం లేని వాళ్ళు తాజాగా తోడు పెట్టుకున్నది వాడుకోవచ్చు.
 2. పెరుగు చిక్కగా (గడ్డ పెరుగు) ఉంటే మంచిది. కొంత మందికి పచ్చడి బాగా  చిక్కగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి  కొంచెం   జారుగా   ఉండాలి. 
 3. ఏదైనా ముందుగా పెరుగును ఒక మల్లు గుడ్డలో వడకట్టి నీరు విడిగా పెట్టుకోండి. ఈ పెరుగును బాగా గరిటెతో గిలక కొట్టండి. ఇలాచేస్తే చిక్కగా creamy గా ఉంటుంది. తరువాత మీకు కావాలంటే నీళ్ళు(ముందు వేరు చేసి పెట్టుకున్నవి కాని లేదా మంచి నీళ్ళు కాని) వాడుకోండి.
 4. పెరుగు తక్కువ వెన్న ఉన్న పాలతో చేస్తే ఆరోగ్యానికి మంచిది.  బరువు తగ్గాలనుకునే వాళ్ళు పిల్లలు తప్ప మిగిలిన వారందరూ  ఈ పెరుగు వాడటమే మంచిది. 
 5. ఇందులో పచ్చి మిరప కారమే బాగుంటుంది. మనం ఎటూ పోపులో ఎండు మిరప కాయలను కూడా వాడతాము. ఉత్తరాదిన ఎక్కువగా ఎర్ర కారం  వాడతారు. మీ ఇష్టాన్ని బట్టి వాడుకోండి. నేను చెప్పే వాటిలో కారం ఎక్కువగా ఉంటుంది. మీరు తినేదానిని బాట్టి  ఎక్కువ తక్కువ వాడుకోండి. ఎండాకాలం తక్కువ తినడమే మంచిది.
 6. పచ్చి మిరపకాయలు పొడుగ్గా గాటు  పెట్టి (చీల్చి)  వేసినా లేదా చీల్చినవి కొంచెం నూనె/నెయ్యిలో వేయించినా కారం తక్కువ ఉంటుంది. ముక్కలుగా కోసి అలాగే వేయచ్చు లేదా వేయించుకోవచ్చు. ఇలా వేస్తే కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కచ్చా-పచ్చాగా దంచి వేసుకోవచ్చు.ఇది ఇంకా కారం ఉంటుంది. ఇదికూడా వేయించి వేస్తే రుచిగాను కొంచం కారం తక్కువగాను  ఉంటుంది. 
 7. వేయించినప్పుడు పచ్చి మిర్చి కాని లేదా ఎర్ర కారం కాని కారం తక్కువ ఉంటుంది.
 8. మిరప  కాయలు చీల్చి వెసినా, ముక్కలు చేసి వేసినా కావలసిన వాళ్ళు తింటారు. అదే దంచి వేస్తే తక్కువ తినే వారికీ కష్టం.  మీరు కారం వేసేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. 
 9. తాళింపు మన ఆంద్ర వంటలకి ప్రత్యేకత. మన పచ్చళ్లలో తప్పక తాళింపు వేస్తాము. ఉత్తరాదిన మాత్రం చాలా మటుకు వేయరు. వేసినా మన లాగ రక రకాలుగా ఉండవు. చాలా తక్కువ దినుసులు వాడతారు. నూనె/నెయ్యి తక్కువగా వాడితే మంచిది.
 10. కొత్తిమీర తురుము, కర్వేపాకు(తాళింపులో) వంటివి వేసుకుంటే, రుచిగాను ఉంటాయి, ఆరోగ్యానికీ మంచిది.
 11. పచ్చడి చేసిన తరువాత కొంత సేపు ఫ్రిజ్జిలో పెడితే రుచి బాగుంటుంది. పులుపు ఎక్కదు. కాని మరీ చల్లగా ఉండకూడదు.
 12. ఇవి అన్నం/రొట్టెలే  కాక మధ్యాహ్నం ఎండగా ఉన్నపుడు snack లాగా  ఉత్తగా తినవచ్చు.
 13.  నేను చెప్పే కొలతలలో 1  కప్పు అంటే 200-250 ml అన్న మాట. అది 2-3 కి సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. 
 14. అలాగే వాడే పచట్లోకి కూరల/పళ్ళ పరిమాణాన్ని మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. 
నేను మరీ ఇంతలా ఎందుకు చెపుతున్నాను అంటే, కొత్తగా వంట చేసుకునే వారికోసం, అసలు వంట రాని వాళ్ళ కోసం. బాగా చేయి తిరిగిన వాళ్ళకి ఇవ్వని తెలుసు అనుకోండి. 1. సాదా  పెరుగు  పచ్చడి 


కావలసినవి:
పెరుగు      1 కప్పు 
పచ్చి మిర్చి   1-2
కొత్తిమీర తరుగు  1 Tbsp
కర్వేపాకు  2  రెబ్బలు 
పసుపు   2-3 చిటికెలు
చక్కర    1/2 tsp
ఉప్పు     తగినంత 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలు


తయారు చేసే విధానం:

 • ముందుగ తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే పచ్చి మిర్చిని గాటు పెట్టి తాళింపులో వేయించుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి.
 • ఒక  గిన్నెలో పెరుగు  తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
 • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 

2. ఆవ పెరుగు పచ్చడి 

కావలసినవి:
పెరుగు      1 కప్పు 
ఆవ   పొడి  1 tsp 
పచ్చి మిర్చి   1-2
కొత్తిమీర తరుగు  1 Tbsp
కర్వేపాకు  2  రెబ్బలు 
పసుపు   2-3 చిటికెలు
చక్కర    1/2 tsp
ఉప్పు     తగినంత 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలుతయారు చేసే విధానం:

 • ముందుగ తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే పచ్చి మిర్చిని గాటు పెట్టి తాళింపు లో వేయించుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి.
 • ఒక  గిన్నెలో పెరుగు, ఆవ పొడి తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
 • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 

ఇవి  అన్నంతో కానీ చేపాతిలు, రొట్టెలు, బిర్యాని, ఫ్రైడ్ రైస్, పులిహోరతో కాని బాగుంటాయి. తీపి ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోవద్దు.మీ...అనామిక....

Tuesday, 27 March 2012

టాకా కుట్టు - Running Stitch-8


Darning Stitch

టాకా కుట్టు/బొంత  కుట్టు కి చెందిన మరొక కుట్టు Darning Stitch. Darning అంటే, ఏదైనా వస్త్రం చిరిగినప్పుడు ఆ చిరుగు కనిపించకుండా అదే రంగు సన్నని దారం తో చిరుగుని కుడతారు. దానినే రఫ్ చేయటమంటాం. డ్రై క్లీనింగ్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఇది చాలా కష్టమైనది. ఎంతో నేర్పు, ఓర్పు అవసరం. కాని ఎంత బాగా చేస్తారంటే పట్టి చుస్తే కాని తెలియదు అక్కడ చిరుగుని రిపేర్ చేసారని. 

Darning Stitch లో  టాకా కుట్లు బాగా దగ్గెరగా ఒక పద్ధతిగా వేస్తారు.  ఇదే కుట్టుని ఉపయోగించి రక రకాలైన డిజైన్లు కుట్ట వచ్చును. దీనిని Pattern Darning అంటారు.

ఈ కుట్టుని, మన దేశంలోని టొడా(Toda) ఎంబ్రాయిడరి, జపాన్ వారి కోగిన్ (Kogin) ఎంబ్రాయిడరి  ఇలా ఎన్నో ఎంబ్రాయిడరిలలో చూడవచ్చు. ఈ కుట్టుని మళ్లీ మనం తరువాత ప్రత్యేకంగా చెప్పుకుందాం. 

ఇంకొన్ని కుట్లు వచ్చే టపాలలో....

మీ...అనామిక....

Monday, 26 March 2012

మన వంతు....భూత దయ


మీకు తెలుసా? మన రాష్ట్రంలో పిచుకల సంఖ్యా 80% తగ్గిందని  ఒక  అంచనా. రాబందులు, సైబీరియన్ క్రేన్...ఇలా ఎన్నో. కొన్ని అసలు లుప్తమైపోతే కొన్ని దాదాపుగా ఆ దశకు చేరుకుంటున్నాయి. ఈ లింక్ లో చూడండి:


వీటన్నిటికి కారణం మానవుని స్వార్ధం, అత్యాశ, విచక్షణా రహితంగా అడవులు, చెట్లు నరికి వేయటం, అడవులను నరికి వేసి, సాగు భూములుగా వాడటం, చెట్లు నాటకపోవటం ఇలా ఎన్నో.  

ఇప్పుడైనా కళ్ళు తెరిచి, మనం కొంతైన పశు పక్షాదులని ఆదుకోవాలి. ముఖ్యంగా నగరాలలో పట్టణాలలో వీటికి తిండి నీరు దొరకదు. పిచుకలు, చిన్న చిన్న పక్షులు, చిలకలు ఇలాంటివాటికి పళ్ళు గింజలు కావాలి.అసలు మన నగరాలలో మొక్కలే పెంచట్లేదు. ఇహ చెట్లా? 

మీరు ఉన్నది చిన్న ఇల్లైన, ఫ్లాట్ అయిన గుప్పెడు ధాన్యపు గింజలు, గుక్కెడు మంచినీళ్ళు అందుబాటులో ఉంచ గలిగితే చాలు. కొన్ని పళ్ళ ముక్కలు కూరల ముక్కలు పెట్టవచ్చు. 

స్థలం ఉంటే  మొక్కలు నాటండి, చెట్లు పెంచండి. చిన్న కుండీలలో అయిన సరే.

పూల మొక్కలు, తుమ్మెదలు, సీతాకోక చిలకలు, తేనెటీగలు సందడి చేస్తాయి. పళ్ళ మొక్కలుంటే, చిలుకలు ఇతర పక్షులు మిమ్మలిని పలకరిస్తాయి. 

ధాన్యం గింజలు తినే పక్షులకి నీరు చాల అవసరం. అంతే కాదు వేసవిలో తాపం నుండి రక్షణకు నీళ్ళలో ఒక మునకైన అవసరం. లోతు ఎక్కువలేని వెడల్పు గల మట్టి ముకుళ్ళ  లో నీళ్లు పోసి పెట్టవచ్చు.   

ఇవిగో నేను మా ఇంట్లోని తోటలో, కిటికీలలో ఇలా చాలా చోట్ల పెడతాను: 
 ఇలా మూకుడులో గింజలు, నీళ్లు పెట్టచ్చు.
 లేదా ప్రమిదలో 
పనికిరాని డబ్బాలలో...శుబ్రం చేసి పెట్టండి.
ఇంకా ఓపికుంటే ఇలాంటి అందమైన మట్టి పాత్రలను మీ తోటలో పెట్టుకోవచ్చు. 

ఏవైనా ఈ పాత్రలను తరుచు శుబ్రపరిచి, శుబ్రమైన నీరు గింజలు ఉంచాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటే, పక్షులు, ఉడుతలు వంటివి మనని పలకరిస్తాయి.

మరి చేస్తారుగా? 


మీ...అనామిక....

Sunday, 25 March 2012

దూరమైన నేస్తాలు

నేను ఖాళీగా ఉన్నప్పుడు, నా గాతాన్ని నెమరు వేసుకుంటాను. ముఖ్యంగా నా బాల్యం. మా అమ్మమ్మ గారి ఇంట్లో, మా బామ్మా గారి ఇంట్లో, మేన మమల ఇంట్లో, సెలవలకి, ఎవైన శుభకార్యాలకి, పండగలకి, పబ్బాలకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఇళ్లు, నా స్నేహితులు, చుట్టాలు పక్కాలు ముక్యంగా మా బాల బృందం (మేనమామ/పిన్నిపిల్లలు/అ వీధిలోని పిల్లలు) మేము ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరులు ఇవన్ని తలచుకుంటే, మళ్లీ కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. 

మా అమ్మమ్మ గారి ఇంట్లో పెద్ద పెరడు. నిండా ఎన్నో పళ్ళ చెట్లు, పూల చెట్లు. మామిడి, నారింజ, జామ, బాదాం, కొబ్బరి, మందార, మల్లె, జాజి ఇంకా ఎన్నో చెట్లు. బాదాం, జామ చెట్ల క్రింద కూర్చుని రామ చిలుకలు కొట్టి పడేసిన పళ్ళు ఏరుకునే వాళ్ళం. చిలుకమ్మ చిలుకమ్మ పండు ఇవ్వు అని అడిగేవాళ్ళం. వెంటనే పండు పడితే అదేదో మా మాట విని పడేసింది అనుకునేవాళ్ళం.  చాల పళ్ళు క్రింద పడేవి. అన్ని పంచుకుని తినే వాళ్ళం.

మా  అమ్మమ్మగారి ఇంట్లో ఇంట్లో నెమల్లు పావురాళ్ళు ఇంకా రంగు రంగుల పక్షులు పెంచే వాళ్ళు. కాని నాకు మాత్రం ఇష్టమైనవి పిచుకలు, కాకులు. పిచుకలంటే చాల ఇష్టం. అవే నాకు నేస్తాలు. మీలో చాలా మందికి కూడా అవి అంటే ఇష్టం కదూ? 

ఉదయాన్నే, వంటింటి వెనుక ఉన్న వసారలోనో లేదా ముందు ఉన్న వసరలోనో  గుంపులు  గుంపులుగా వచ్చి గోల చేస్తూ ఉండేవి. వాటి కోసం ఎప్పుడు మా అమ్మమ్మ కొంత ధాన్యపు గింజలు వెదజల్లేది. నూకలు, ఇతర ధాన్యపు గింజలు పెరడులో చిన్ని బుట్టలలో ఉంచేది. లేదా పనికిరాని పాత్రలలో పోసి ఉంచేది. వేసవిలో మట్టి ముకుళ్ళలో నీళ్లు నింపి అక్కడక్కడ ఉంచేది. నుతి గట్టు దెగ్గర బొక్కేనలో నీళ్లు పెట్టి ఉంచే వాళ్ళు. 

నీటిలో ఆ పిచుకలు జలకాలడుతుంటే మాకు చాలా వింతగా ఉండేవి. ఇంట్లోనూ వసారాలో పెంకుల క్రింద దూలాలలొ ఎన్నో గుళ్ళు పెట్టేవి. వాటి లో గుడ్లు, అవి తరువాత పిల్లలుగా మారడం, వాటికీ ఏ పురుగో ధాన్యపు గింజలో తల్లి తండ్రి తెచ్చి నోట్లో పెట్టడం...ఇవ్వన్ని మాకు వింతలూ.

ముఖ్యంగా మా అమ్మమ్మగారి ఇంట్లో పెద్ద అద్దం ఉండేది. అప్పట్లో టేకు చెక్కలో నవిషీలు చెక్కి అందంగా ఉండేది. ఆ అద్దంలో తన ప్రతి బింబాన్ని చూసుకుని అవి వేరే పిచుకలనుకుని ముక్కు నుండి రక్తం కారేదాకా అద్దాన్ని పొడవటం చుస్తే అబ్బో ఎంత కోపమో అనుకునేవాళ్ళం. 

మేము ఉన్న ఉళ్లలో కూడా చాలా చూసే వాళ్ళం. ఒక 10 ఏళ్ళ క్రితం వరుకు మా ఇంట్లో కూడా అవి తిరగాడుతూ ఉండేవి. ఉన్నట్లుండి మాయం అయిపోయాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవి మన నేస్తాలు. మనికి మేలు చేస్తాయి. 

విచక్షణ రహితంగా పోలాలో రసాయన పురుగుల మందు వాడటం, విత్తాన్న శుద్ధికి రసాయన మందులు వాడటం, పిచుకలకు వాసయోగ్యమైన పాడుబడిన భవనాలు లేదా తుప్పలు, పొదలు, చెట్లు, లేకపోవటం కొన్ని కారణాలు. మన ఇళ్లు కూడా ఒకప్పుడు, దూలాలు, పెంకులతో ఉండేవి. ఇప్పుడు ఈ సిమెంట్ కట్టడాలలో వాటికి స్థలం ఏది? వేరే పక్షులతో తిండికి పోతిపడటం, unleaded petrol వాడకం సెల్ టవర్ల నుండి వేలు బడే రేడియో తరంగాలు వంటివి కూడా కారణాలే. 

పిచుకల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ లో చూడండి 

పిచుకలను మనం రక్షించుకోకపోతే మన ప్రకృతిని రక్షించుకోలెం. మరి ప్రకృతి  లేక పొతే మన మాటేంటి. మన తరువాతి తరాలు  పిచుకలంటే జూలో చూడాలేమో? అసలు అదీ సాధ్య పడదేమో? దయ చేసి మీరు ఆలోచించండి. మార్చి 20 న Save Sparrow Day గా జరుపుకుంటాం ప్రతి ఏడాది.

నా వంతు గా నేను కొంత చేస్తున్నాను. మరి మీరు? ఈ క్రింది లింక్ లో చూడండి. మీకు నచ్చిన  విధంగా మీ వంతు చేయండి.

అంతే కాదు మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు -అందరిని జాగృతం చేయండి. ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న చేయి, చేయుతమవుతుంది  మన నేస్తలను మళ్లీ మన మధ్యన నిలపటానికి.

మీ...అనామిక....

టాకా కుట్టు-Running Stitch-7

Double Running Stitch -Holbein Stitch 


ఇది టాకా కుట్టులో ఒక రకం. ఎక్కువగా Black Work మరియు Assisi Work లో వాడతారు. మన దేశంలో కర్ణాటకలో కసూటి  లేదా దారావడి   కుట్టులో వాడతారు.


ఇది  ఎలా  కుట్టాలంటే, ముందుగా ఒక వరుస టాకా కుట్టు (నిలం రంగు)  A నుండి F వరకు కింద చూపిన విధంగా కుట్టాలి. తరువాత F నుండి A వరకు  (ఎర్ర  రంగు)  కుట్టాలి. మునుపు దారం దూర్చిన చోటనే మళ్లీ దారం దురుస్తూ రావాలి. అంటే E నుండి D, C నుండి B ఇలా అన్నమాట. 
                _______________  
              A    B    C    D   E   F

 ఇది ఒక రేఖ లాగా కుట్టింది.
ఇక్కడ చూడండి ఎలా కుట్టవచ్చో ఈ కుట్టుని. 


ఇంకా  రకరకాలుగా  కుట్టుకోవచ్చు. అవి తరువాత నేర్చుకుందాం.  ఎన్నో డిజైన్లు ఉన్నాయి. 


మీరు ఇవ్వన్ని నేర్చుకుని సాధన చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగా సాధన చేస్తే కుట్టు అంతే అందంగా వస్తుంది. తరువాత కష్టమైన కుట్లు  చెప్పుకున్నప్పుడు మనకి సులభంగా ఉంటుంది. 


మరి కొన్ని కుట్లు తరువాతి టపాలలో.... చూస్తూ ఉండండి  నా బ్లాగ్ ని ....


మీ...అనామిక....

Saturday, 24 March 2012

పచ్చళ్ళు-1

మన ఆంధ్ర రాష్ట్రం పచ్చళ్ళకి  పెట్టింది పేరు. మన దక్షినాది వాళ్ళు చేసే పచ్చళ్ళు మరి ఉత్తరాదిన చేసేవి కొంచెం భిన్నంగా ఉంటాయి. మన పచ్చళ్ళు కారంగా ఉంటాయి. ఉత్తరాదివి తియ్యగా, పుల్లగా కొద్దిగా కారంగా  ఉంటాయి.

ఇవి అన్నం, రొట్టెలు, చపాతీలు, పూరీలు, పరాఠాలు, ఇడ్లి, దోశ, సమోసా, చాట్ ఇలా ఎన్నో వాటితో తినవచ్చు. 

రకరకాలైన పచ్చళ్ళు రకరకాలయిన పదార్ధలతొ చేసుకొవచ్చు. మన అమ్మలు, అమ్మమ్మలు బామ్మలు చేసెవే కాకుండా కొత్తవి ఎన్నొ రకాలు నేర్చుకుందాం.

పచ్చళ్ళు రెండు రకాలు:
1. రోజువారి పచ్చళ్ళు 
2.  నిల్వ పచ్చళ్ళు 


1. రోజు వారి పచ్చళ్ళు : వీటిని  హిందీలో చట్ని అంటారు. ఇదే పదం మనమంతా కూడా వాడతాము. ఈ పదం ఎంత ప్రాచుర్యం పొందిదంటే ఏకంగా ఆంగ్ల నిఘంటువులో కూడా చోటు సంపాదించుకుంది.

రోజువారీ పచ్చళ్ళ ని రోటి పచ్చళ్ళు, బండ పచ్చళ్ళు అని కూడా అంటారు. ఇవి ఒకటి లేక రెండు రోజులకంటే ఉండవు, ఫ్రిజ్జ్ లో పెడితే తప్ప. కొన్ని మాత్రం నూనె ఎక్కువ వేసి చేస్తే ఒక వారం ఉండవచ్చు.

అయితే ఈ రోజువారి పచ్చళ్ళకి  తాజా కూరలు, పళ్ళు మొII వాడతాం. నూనె ఉప్పు కూడా తక్కువగా వాడతాం. ఈ పచ్చళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి రుచి కూడాను.

నేనైతే ఇప్పటికీ చాల మటుకు రోలు-రోకలి వాడతాను. మిక్సి లో చేస్తే  అంత రుచి ఉండదు. కాకపోతే మనం హడావిడిగా ఏ ఉదయం పూటో చేయాలంటే వేరే మార్గం లేదు. 
2. నిల్వ పచ్చళ్ళు: వీటిని ఉరగాయాలని అంటాం. ఆంధ్ర ఉరగాయలు చాల ప్రసిద్ది. అయితే ఉత్తరాదివి కొన్నివెరైటిగా రుచిగా నోటికి చాలా బాగుంటాయి. 
మనం అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని ప్రాంతాలవి చెప్పుకుందాం. 

పచ్చడి అయిన ఉరగాయలైన వాడె దినుసులన్నీ తాజాగా, నాణ్యమైనవి అయితే, రుచీ బాగుంటుంది. 

మరి మీరు రెడినా? వచ్చే టపాలలో రుచికరమైన పచ్చళ్ళు సుళువుగా చేసే విధానం తెలుసుకుందాం....


మీ...అనామిక....

వంట-వార్పూ

మన దేశంలో ఎన్ని ప్రాంతాలున్నాయో ఎన్ని రాష్ట్రలున్నాయో, ఎన్ని భాషలున్నాయో, అన్ని సంస్కృతులు, అన్ని విభిన్నమైన వంటలు వాటిని చేసే పధతులూ ఉన్నాయి. కాష్మీరు నుండి కన్యా కుమారి వరకు, గుజరాత్ నుండి ఈశన్య రాష్ట్రాల వరకు వంటలు, వాటిని వండే పదతులలో చాల వైవిధ్యం ఉన్నది. అయితే కొన్ని సారుప్యతలూ ఉన్నాయి. కొన్ని వంటలు అందరు చేస్తారు. వండే పదతులలో కొంచం తేడ, పేర్లు వేరు అంతే. 

నాకు వంట చేయడం చాల ఇష్టం. సరదా కూడా. అందుకే దేశ విదేశాల వంటలు, పధతులు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాను. కొంత సృజనను జోడించి కొత్తవి చేస్తూ ఉంటాను. 

ప్రతి ప్రాంతానికీ వంటలు చేసే పధతిలో ఒక ప్రతేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను తెలుసుకుంటే ఇక ఆ ప్రాంతం వంటలు మనం సుళువుగ చేసేయచ్చు. 

నేను నేర్చుకున్న ఆ విషయాలు, పధతులు, అనుభవాలు మీతో పంచుకోవాలని ఒక చిన్ని అభిలాష.  మరి మీరు ఈ శీర్షికని ఆదరిస్తారని ఆశిస్తాను. 


మీ...అనామిక....

Friday, 23 March 2012

రంగవల్లి -50

ఉగాది పండుగ ప్రత్యేకం

ఉగాది పచ్చడి -వగరు పులుపు కలిసిన మామిడి కాయలు, వేపపువ్వు, చింత పండు, బెల్లం, పచ్చి మిరపకాయలు, మిరియాలు చెరుకు ముక్కలు కొత్త కుండ ఇవన్ని పచ్చడికి కావలసినవి. కొన్ని ప్రాంతాలలో ఉగది రోజున కొత్త కుండలో నీరు పోసి దానితో పచ్చడికి వాడతారు. ఈ రోజు నుంచి వేసవి కాలమంతా  ఆ కుండను నీళ్ళకి వాడతారు. 

షడ్రుచుల కలయిక ఈ ఉగాది పచ్చడి. నాకైతే చాల ఇష్టం. అందుకే ఇలా ఈ రంగవల్లి వేయలనిపించిది. 

పండుగ కదా పళ్ళెంలో మిఠాయిలు కూడా ఉన్నాయి.

21 నుండి 1 సరి  చుక్కలు. మీకు నచ్చిందనుకుంటాను

మీరు ఒకసారి వేసి చూడండి....


మీ...అనామిక....

Wednesday, 21 March 2012

రంగవల్లి -49

ఉగాది ప్రత్యేకం- కలువలు-స్వస్తిక

13 నుండి 1 ఎదురు  చుక్క . 

ఇంకొన్ని ముగ్గులు వచ్చే టపాలలో...చూస్తూ ఉండండి నా బ్లాగ్ ...


మీ...అనామిక....

Tuesday, 20 March 2012

రంగవల్లి - 48

మామిడి పిందెలు- మల్లె మొగ్గలు -ఉగాది ప్రత్యేకం 

చైత్ర మాసం వచేస్తోంది, ఉగాది తెచేస్తోంది. రంగు రంగుల పుష్పాలు , లేలేత చిగుళ్ళతో కళ కళ లాడే చెట్లు, ఝుమ్మని పాడే తుమ్మెదలు, ఉరకలు వేస్తూ పువ్వు పువ్వుని పలకరించే అందమైన సీతాకోకచిలుకలు.వగరు పులుపులతో  పచ్చి మామిడి కాయలు, మత్తెకించే మల్లెపువ్వులు. కుహు కుహు గానాలతో కోయిలల సందడి. ప్రకృతీ కాంత అందంగా సింగరించుకుంటూ ఉంటే చైత్ర లక్ష్మి మనను అసిర్వదించటానికి వస్తుంటే ఎంత అందం ఎంత ఆనందం.

మరి ఆ చైత్ర లక్ష్మిని అవ్హానించడానికి మన ముంగిట్లో, ముత్యాల  ముగ్గులు వేసి రత్నాల రంగులు అద్ది, సువాసనలు వెదచల్లె రంగు రంగుల రమణీయమైన పుష్పాలతో అలంకరించి స్వాగతం పలకాలిగా. 

అందుకే కొన్ని రంగవల్లులు మీ కోసం....
15 X 1 ఎదురు చుక్కలు.

మరిన్ని వచ్చే టపాలలో....

మీ...అనామిక....

Monday, 12 March 2012

టాకా కుట్టు -Running Stitch -6

ఇక్కడ  ఈ కుట్టులో ఇంకొన్ని ప్రయోగాలూ చూడండి:


ముందుగ టాకా కుట్లు కుట్టి అటు తరువాత అందులో నుండి దారం పై విధంగా దుర్చటమే.

మూడో ఫొటోలో పై వరుస కుట్లు నిలువుగా ఉన్నాయి చూడండి.

పైన ఉన్న కుట్లను బార్దార్స్ లాగా వడ వచ్చు. వేరే కుట్లతో కలిపి, వేదలుపు బాడర్స్ కుట్ట వచ్చు. పిల్లల ఫ్రాక్స్, టేబుల్ క్లాత్, టేబుల్ మాట్స్,  టవల్స్ ఇలా ఎన్నో వాటికీ వాడవచ్చు. 
వరుసల మధ్యలో పూసలు కుట్టినా బాగుంటుంది. ఇలా డబ్బాలుగా కూడా వరుసగా రంగు రంగు దారాలతో కుట్ట వచ్చు. ఇంకా ఎన్నో ఆకారాలు కుట్ట వచ్చు.

ఇంకొన్ని కుట్లు వచ్చే టపాలలో....

మీ...అనామిక....

Saturday, 10 March 2012

టాకా కుట్టు -Running Stitch-5


Double Threaded Running Stitch

టాకా కుట్టుతో ఇంకొక కుట్టు చూద్దాం. దీనిని దబుల్ థ్రెడెడ్ రన్నింగ్ స్టిచ్ Double Threaded Running Stitch అంటారు. 
మొదటి కుట్టు చూడండి. ముందుగా మనకు కావలసినన్ని టాకా కుట్లు(పసుపు రంగు దారం) కుట్టుకోవాలి. 

తరువాత ఒక ప్రక్క నుండి ఆరెంజ్ రంగు దారం మొదటి టాకా కుట్టుకి దగ్గరగా బట్ట అడుగు నుండి పైకి తీసి Threaded Running Stitch  లాగా కుట్టాలి. ఇది పూర్తి అయిన తరువాత దారాన్ని బట్ట అడుగుకి తీసుకోనవసరం లేదు.  తరువాత అటు నుండి ఇటు మళ్లీ Threaded Running Stitch లో  లాగా   దారం అల్లాలి. ఇలా చేసేటప్పుడు మీరు కుట్టే బట్టను అడుగు భాగం పైకి వచ్చే విధంగా పట్టు కుంటే (తలక్రిందులగా/reverse direction) సుళువుగా ఉంటుంది. 

ఈ కుట్టు లో కొన్ని విధాలను పైన చూడవచ్చు. ఇంకా రకరకాలుగా కుట్ట వచ్చు. 

మీకు నేను చెప్పేవి అర్ధం కాకాపోయిన లేదా ఎవైన సందేహాలున్నా, అలాగే మీ సలహాలను నాకు e -mail చేయండి. 

ఇంకొన్ని కుట్లు వచ్చే టపాలలో...


మీ...అనామిక....

Friday, 9 March 2012

టాకా కుట్టు-Running Stitch-4


Threaded Running Stitch

ముందుగా టాకా కుట్లు కుట్టి, వాటిలోనుండి దారాన్ని క్రింద చూపిన విధంగా తీయాలి:
రెండు దారాలు, ముదురు లేత రంగులు కాని లేదా కాంట్రాస్ట్ కాని అయితే బాగుంటుంది. అలాగే ఎక్కువ తక్కువ పోచలు కాని లేదా సన్నగా లావుగా ఉన్న దారాలతో కుట్ట వచ్చు. ఇలాంటి కొన్ని వరుసలు దగ్గరగా, దూరంగా, ఒకే రంగులో వివిధ చాయల దారాలను  దగ్గరగా  వాడినా బాగుంటుంది. ఎక్కువగా కుట్ట వలసిన భాగాని తొందరగా నింపవచ్చు. 

ఈ కుట్టు బార్డర్ గా కాని లేదా అవుట్ లైన్ గా కాని వడ వచ్చు. దిండు గలేబులు, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్, టేబుల్ క్లాత్ వంటి వాటికే కాక, పిల్లల పరికిణీలు వంటి వాటికి వాడ వచ్చును. చీరలకి, చున్నీలకి, కుర్తాలకి కూడా వాడ వచ్చు. చాలా సులభంగా తొందరగా కుట్టేయవచ్చు. 


మీ...అనామిక....

Thursday, 8 March 2012

టాకా కుట్టు -Running Stitch-3

Whipped Running Stitch

టాకా కుట్టులో  Whipped Running Stitch చూడండి.

ముందుగా ఒక రంగు దారంతో టాకా కుట్టు కుట్టాలి. తరువాత వేరే రంగు(కాంట్రాస్ట్ కానీ లేదా ముదురు లేత గాని) దారం తీసుకుని మొదటి  టాకా  కుట్టు దగ్గరగా బట్ట అడుగునుండి పైకి తీసి ఒక కుట్టు నుండి పైకి తరువాతి కుట్టునుండి క్రిందికి దురుస్తూ (బట్ట లో నుండి దూర్చ కూడదు)   పైన చూపిన విధంగా  దూర్చి చిట్ట చివరి టాకా కుట్టు దగ్గరగా  బట్ట అడుగు భాగానికి దించి ముడి వేయాలి.  


ఈ  కుట్టుని బార్డర్, అవుట్ లైన్ లా వాడుకోవచ్చు. పిల్లల ఫ్రాక్స్, దిండు గలేబులు, టేబుల్ మాట్స్, టవల్స్, కిచెన్ లినెన్ ఇలా వేటిమిదనైన వాడ వచ్చు. 

ఇలా ఈ కుట్టుని చాల రకాలుగా కుట్టవచ్చు మన సృజనను బట్టి. వచ్చే టపాలలో ఇంకొన్ని...

మీ...అనామిక....

Wednesday, 7 March 2012

టాకా కుట్టు -Running Stitch-2

టాకా కుట్టుని బొంత కుట్టు అని కూడా అంటారు. పూర్వం మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు తమ పాత నూలు చీరలను ఒక దాని పై ఒకటి వేసి బొంతలు కుట్టే వాళ్ళు. అప్పుడు ఈ బొంత కుట్టు వాడేవాళ్ళు. సరే ఆ బొంత కుట్టు గురించి తరువాతి టపాలలో ఇంకా చెప్పుకుందాం. 

చూసారా రంగు రంగు దారాలతో ఈ కుట్టుని ఎలా కుట్టవచ్చో. నేను 6 పొరల దారాన్ని వాడాను . 

Checker Board Running Stitch

టాకా కుట్టు ఎలా కుట్టాలో నిన్న చూసాం కదా, ఇప్పుడు ఈ కుట్టు ని  ఉపయోగించి మరిన్ని కుట్లు నేర్చుకుందాం. ఈ క్రింది కుట్టుని Checker Board Running Stitch అంటారు.
చూసారుగా 2, 4, 6 వ వరుసలోని కుట్టు పై వరుసలోని రెండు కుట్ల మధ్యన ఉండాలి. ఈ కుట్టుని కూడా ఇంకా రక రకాలుగా కుట్టవచ్చు.

మరి  మీరు బాగా ఈ కుట్టుని సాధన చేయండి. తరువాతి టపాలలో కొత్తవి నేర్చుకుందాం......  

మీ...అనామిక....

Tuesday, 6 March 2012

టాకా కుట్టు- Running stitch-1

Running Stitch అంటే టాకా  కుట్టు . ఇదా అని అనుకోవద్దు. ఈ కుట్టుని కొట్టిపరేయవద్దు.ఇంత సులభమైన సామాన్యంగా కనిపించే కుట్టుతో అద్భుతాలను సృష్టించ వచ్చు. 

ఈ కుట్టు ను మామూలు బట్ట పై కాని మ్యాటి బట్ట పై కాని కుట్టవచు. 

ఈ కుట్టు ను కుట్టే పధ్ధతి ఇది: 
బట్ట అడుగు భాగం నుండి పైకి "A" దగ్గర తీసి మరల "B" దగ్గర బట్ట అడుగు భాగానికి దింపండి. 
 ఇలా కుట్లు వరుసగా వేస్తె వచ్చేది టాకా కుట్టు లేదా Running Stitch. 

కుట్ల మధ్య దూరం సమంగా ఉండాలి. ప్రతి కుట్టు పొడవు కూడా సమానంగా ఉండాలి. ఈ కుట్టును కేవలం ఒక రేఖ (straight line) లానే కాకా ఏ ఆకారంలో నైన కుట్ట వచ్చు. దీనిని outline stitch లాగా కూడా వాడుతారు. కుట్టు మరీ బిగుతుగా కాని మరీ వదులుగా కాని ఉండకూడదు. 

కుట్ల పొడువు, మధ్యన ఉన్న దూరం లో మార్పులు చేసి , రంగు రంగుల దారాలు, ఎక్కువ, తక్కువ పొరలు గల దారాలు, రక రకాలైన సైజుల దారాలు వాడి అనేకమైన డిజైన్లు సృష్టించవచ్చు. 

ఉపయోగం: 

ఈ కుట్టుని 
 • అవుట్ లైన్ గా వాడుకోవచ్చు. 
 • ఒక ఆకారాన్ని నింపటానికి(ఫిల్లింగ్) వాడ వచ్చు
 • సమానమైన లేక ఒక పధతిగా కుట్ట వచ్చు లేదా 
 • ఇష్టం వచ్చి నట్లు అంటే ఒక పదతిలో కాక విసిరి వేసినట్లు (staggered) గాను కుట్ట వచ్చు
 • దిండు గలేబులు, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్, టేబుల్ క్లాత్, హ్యాండ్ టవల్స్,  కిచెన్ లినెన్ పిల్లల పరికిణీలు వంటి వాటికీ  వాడ వచ్చును. చిరలకి, చున్నీలకి, కుర్తాలకి కూడా వడ వచ్చు. చాలా సులభంగా తొందరగా కుట్టేయవచ్చు. 

ఈ కుట్టు తో మరెన్నో కుట్లు కుట్ట వచ్చు. అవి ఎలాగో తరువాతి టపాలలో చూద్దామా.....


మీ...అనామిక....

Monday, 5 March 2012

ఎంబ్రాయిడరి కుట్లు-కావలసినవి-1

మనం కుట్టే ఎంబ్రాయిడరి అందంగా ఉండాలంటే వాడే బట్ట, దారాలు, డిజైన్, కుట్లు అన్ని జాగ్రత్తగా ఒకదానికొకటి సరిపోయేలా ఎంచుకోవాలి. అంటే సున్నితమైన పలుచని పట్టు బట్ట పై చేసే ఎంబ్రాయిడరి పట్టు, జరీ దారాలతో నాజుకుగా చేస్తేనే బాగుంటుంది. అందుకని ఎంబ్రాయిడరి చేసే ముందర ఇవన్ని చూసుకుని ఎంచుకోవాలి. తీరా కుట్టాక దానిని సరి చేయలేము.

ముందుగా కావలసిన వాటి గురించి కొంచెం చెప్పుకుందాం. కావలసినవి:
 1. Fabric--  బట్ట
 2. Needles-- సూదులు
 3. Threads-- దారాలు 
 4. Hoop/Frame-- చట్రం 
 5. Scissors-- కత్తెర 
 6. Design/Pattern-- డిజైన్ 
 7. Tracing  paper pen/pencil-- ట్రేస్ పేపరు పెన్ను లేక పెన్సిలు 

1. Fabric--బట్ట

ఎంబ్రాయిడరికి వాడే బట్ట(fabric): నూలు(cotton), జనపనార(Jute) వెదురు (Bamboo), అరటి నార (Banana plant fiber), అవిసె నార (Linen), పట్టు(silk) వంటి సహజమైన బట్టను కాని లేదా nylon, chiffon, crepe వంటి సింథెటిక్ బట్టను కాని ఏవైనా వాడవచ్చు. మల్లు, షిఫాన్ పట్టు వంటి పలుచనివి, లేదా మొద్దుగా ఉండే కెనవాస్, కేస్మెంట్ వంటివీ వాడవచ్చు. 
Freestyle ఎంబ్రాయిడరి అయితే మాములు బట్ట వాడతారు-- అంటే నేత బాగా దెగ్గరగా/గట్టిగా ఉండేవి (even weave). అదే Counted Thread Embroidery కి నేత దూరంగా ఉండే మ్యాటి బట్టను వాడతారు. 

ఈ క్రింది లింక్ లో రకరకాలైన ఫ్యాబ్రిక్ చూడండి:

మరికొన్ని విశేషాలు వచ్చే టపాలలో.....
మీ...అనామిక....